నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత | Sakshi
Sakshi News home page

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

Published Thu, Mar 1 2018 1:00 AM

Captured the fake cotton seeds - Sakshi

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు భారీగా నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. రామగుండం టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ, బెల్లంపల్లి వన్‌టౌన్‌ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ చేసి నకిలీ విత్తనాల గుట్టును రట్టు చేశారు. ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న 13 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపించారు. బుధవారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ విజయసారథితో కలసి బెల్లంపల్లి ఏసీపీ వి.బాలుజాదవ్‌ వివరాలు వెల్లడించారు.

బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల వద్ద కొందరు వ్యక్తులు కార్లలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయించడానికి సిద్ధమవుతున్నట్లు పోలీసులకు మంగళవారం సాయంత్రం సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు రాత్రి సుమారు 8.30 గంటల ప్రాంతంలో నాలుగు బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. నాలుగు కార్లు, ఆటోలో ఉన్న 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. బెల్లంపల్లికి చెందిన కొత్తపల్లి శ్రీనివాస్‌ అనే ఫెర్టిలైజర్‌ షాపు యాజమానికి నకిలీ పత్తి విత్తనాలు విక్రయించడానికి వచ్చినట్లు వారు తెలిపారని పోలీసు అధికారులు వివరించారు. వీరి వద్ద నుంచి 3.20 క్వింటాళ్ల నకిలీ లూజ్‌ విత్తనాలు, శ్రీపావని పేరుతో ఉన్న 600 నకిలీ విత్తనాల ప్యాకెట్లు (3 క్వింటాళ్లు), రూ.2.53 లక్షల నగదు, రూ.లక్ష విలువైన చెక్కు, 17 సెల్‌ఫోన్లు, నాలుగు కార్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాల విలువ మార్కెట్లో రూ.12.48 లక్షలు ఉంటుందని తెలిపారు. 

Advertisement
Advertisement