ఫ్లిప్‌కార్ట్‌-వాల్‌మార్ట్‌ డీల్‌ మన కలను చంపేస్తోంది

10 May, 2018 09:00 IST|Sakshi
ఫ్లిప్‌కార్ట్‌-వాల్‌మార్ట్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : దేశంలో మునుపెన్నడూ ఎరుగని భారీ విదేశీ డీల్‌కు బుధవారం తెరలేసిన సంగతి తెలిసిందే. అమెరికా రిటైల్‌ అగ్రగామి.. దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను తన చేజిక్కించేసుకుంది. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 16 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేస్తూ... ఆ కంపెనీని తన సొంతం చేసుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ డీల్‌పై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌-వాల్‌మార్ట్‌ డీల్‌ దేశీయ స్టార్టప్‌ల విజయానికి ప్రతీకగా మార్కెట్‌ విశ్లేషకులంటుంటే.. ఈ డీల్‌ పూర్తిగా ‘అనైతికం’ అని, దేశ ప్రయోజనాలను ఇది దెబ్బతీస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగ్రన్‌ మంచ్‌(ఎస్‌జేఎం) ఆరోపిస్తోంది.  ఈ డీల్‌ భారత ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమాన్ని చంపేస్తుందని హెచ్చరిస్తూ... ప్రధాని నరేంద్ర మోదీకి ఎస్‌జేఎం లేఖ రాసింది. ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిన లేఖలో, ఈ డీల్‌ దేశీయ వ్యవస్థాపకతను, ఉద్యోగవకాశాల సృష్టిని హరింపజేస్తాయని, ఇది పూర్తిగా వ్యవసాయదారులకు వ్యతిరేకమని ఆరోపించింది.

భారత మార్కెట్‌పై దాడి చేయడానికి వాల్‌మార్ట్‌ ఈ-కామర్స్‌ మార్గాన్ని ఎంచుకున్నట్టు పేర్కొంది. చాలా బరువెక్కిన హృదయంతో ఈ లేఖను తమకు రాస్తున్నామని, వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఎస్‌జేఎం కోరింది. దేశీయ కంపెనీలు తమ సంస్థలను అతిపెద్ద బహుళ జాతీయ సంస్థలకు విక్రయించేస్తున్నాయని, ఇది తమ దేశీయ మార్కెట్‌కు చాలా ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ డీల్స్‌ మార్కెట్‌లో పలు రకాల అంతరాయాలకు పురిగొల్పి, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలను, చిన్న చిన్న దుకాణాలను అసలకే లేకుండా చేస్తుందని ఎస్‌జేఎం తన అంచనాలను వెలువరించింది. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకుని, కింది స్థాయి వ్యాపారాలను కాపాడతారని ఆశిస్తున్నామని పేర్కొంది. చైనీస్‌ ఉత్పత్తులను దిగుమతి చేయడంలో వాల్‌మార్ట్‌ ప్రపంచంలో టాప్‌-7 దేశంగా ఉందని... ఇది చైనా ఉత్పత్తులను మన దేశంలోకి ప్రవేశపెట్టి, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలను దెబ్బతీసి మేకిన్‌ ఇండియా కలను హరింపజేస్తుందని ఎస్‌జేఎం ఆరోపిస్తోంది. అటు కమ్యూనిస్ట్‌ పార్టీ కూడా ఫ్లిప్‌కార్ట్‌-వాల్‌మార్ట్‌ డీల్‌ను వ్యతిరేకిస్తోంది.

మరిన్ని వార్తలు