ఫ్రీగా ఎవరూ.. ఏదీ ఇవ్వరు!

8 Oct, 2018 08:38 IST|Sakshi

తక్కువ ధరకు, గిఫ్ట్‌ల పేరుతో ఆన్‌లైన్‌ మోసాలు

వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్న వెబ్‌సైట్లు

విషయం తెలియక మోసపోతున్న అమాయకులు

డిజిటల్‌ మార్కెటింగ్, ఈ– కామర్స్‌ మార్కెట్ల పుణ్యమా అని షాపులకు వెళ్లకుండానే మనకు కావాల్సిన వస్తువులను నేరుగా ఇంటి వద్దకే తెప్పించుకునే వెసులుబాటుతో ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. నాణేనికి ఇది ఒకవైపు మాత్రమే. నిజానికి ఆన్‌లైన్‌లో మనం చూసే వెబ్‌సైట్లలో చాలా వరకు నకిలీవి పుట్టుకొస్తున్నాయి. ఇంటర్నెట్‌ బ్రౌసింగ్‌ ప్రారంభించగానే మీకు ఫ్రీగా స్మార్ట్‌ ఫోన్‌ అందిస్తాం. చౌకగా ల్యాబ్‌టాప్‌ పంపిస్తామనే  ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఈ ప్రాసెస్‌లో మీరు చేయాల్సింది ఒక్కటే మీ డిటైల్స్‌తో కూడిన ఫామ్‌ను పూరించి తమకు అందించడమే తరువాయి. వారం రోజుల్లో సెలక్ట్‌ చేసుకున్న ప్రొడక్ట్‌ మీ ఇంటికి పంపిస్తామనే ప్రకటనలతో అమాయకుల డబ్బులు కాజేసి బురిడీ కొట్టిస్తున్నాయి కొన్ని వెబ్‌సైట్లు.  

సాక్షి, హైదరాబాద్‌: తెలియని వ్యక్తికి ఏ కంపెనీ ఉచితంగా గిఫ్టూ ఇవ్వదు. కానీ కొందరు ఇదేం పట్టించుకోక సదరు కంపెనీకి తమ వ్యక్తిగత డాటాను చేరవేస్తారు. ఇలా సంబంధిత వ్యక్తి వివరాలను తీసుకుని రెండు రోజుల్లో ప్రాసెస్‌ జరుగుతుందని నమ్మించి.. ఆ తర్వాత మీ ప్రొడక్ట్‌ రెడీగా ఉంది కానీ కస్టమ్స్‌ చార్జీలు పంపించండని చెబుతారు. ప్రొడక్ట్‌ విలువను బట్టి కస్టమ్స్‌ చార్జీలను నిర్ణయిస్తామంటారు. వినియోగదారుడు పూర్తిగా నమ్మితే గాని ఖాతా వివరాలను షేర్‌ చేయరు. ఖాతా వివరాలను పంపిన తర్వాత మీ ప్రొడక్ట్‌ వ్యాల్యూ లక్ష రూపాయలు అని, మీరు కేవలం పదిశాతం పన్ను చెల్లిస్తే సరిపోతుందని చెబుతారు. సదరు వ్యక్తి డిపాజిట్‌ చేసిన తర్వాత నుంచి వినియోగదారునికి ఎటువంటి రిప్లై ఇన్ఫర్మేషన్‌ లభించదు. సదరు వినియోగదారుడు తాను మోసపోయానని తెలిసేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలా ట్రాన్స్‌ఫర్‌ అవుతున్న మొత్తం ఒక్కోసారి లక్షల్లో కూడా ఉండటం గమనార్హం. 

‘ఆయుష్మాన్‌ భారత్‌’ పేరుతో ఆన్‌లైన్‌ ఫ్రాడ్‌..
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టిన విషయం విదితమే. దీనిపై ఇప్పటికే అనేక నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి. ఆయుష్మాన్‌ భారత్‌ అధికారిక వెబ్‌సైట్‌ httpr://www.abnhpm.gov.in/ని పోలి ఉండేలా నకిలీ వెబ్‌సైట్లు డిజైనింగ్‌తో సహా రూపొందించారు. ఆయా నకిలీ వెబ్‌సైట్లలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఫొటోలు పెట్టడంతో పాటు.. రూ.1000 నుంచి రూ. 2000 ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు అంటూ జనాలను మోసం చేసే మెసేజ్‌ పొందుపరిచారు. అంతేకాదు,  ‘పేదలకు చేరేలా ఈ మెసేజ్‌ అందరికీ షేర్‌ చేయమని’ వినియోగదారులను నకిలీ వెబ్‌సైట్లు ట్రాప్‌ చేస్తున్నాయి. తెలిసీ తెలియక చాలామంది అమాయకులు వారు కోరిన మొత్తాన్ని చెల్లించి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.  గిజ్చ్టిట్చ ppలో కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పేరిట నకిలీ వెబ్‌సైట్లు విస్తృతంగా సర్కులేట్‌ అవుతున్నాయి. ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. ఇతరులకు షేర్‌ చేయవద్దు.  

డబ్బులు వసూలు చేస్తే అది నకిలీదే..
‘ఆయుష్మాన్‌ భారత్‌’ పేరిట ఉచితంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు. ఒకవేళ ఏదైనా వెబ్‌సైట్‌ ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లయితే దాన్ని కచ్చితంగా నకిలీ వెబ్‌సైట్‌గా ప్రజలు పరిగణించాలి. కొన్ని సైట్లు డబ్బులు ఏమీ అడగకుండానే ప్రజల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని ఆయుష్మాన్‌ భారత్‌ సీఈఓ ఇందు భూషణ్‌ వెల్లడించారు. ఈ స్కీమ్‌కు సంబంధించి కేవలం 1455 నంబర్‌ మాత్రమే ఉందని, ఇతర నంబర్లను నమ్మవద్దని ఆయన హెచ్చరించారు.

జియో ల్యాపీ రూ.599కే.. ఈ లింక్‌ చూశారా..?
ఇలాంటిదే మరో ఫేక్‌ వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అదే జియో వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌. చిత్రంలో కనిపిస్తున్న వెబ్‌సైట్‌ను చూశారు కదా. ఈ వెబ్‌సైట్‌లోకి వెళితే జియోకి సంబంధించిన వస్తువులన్నీ తక్కువ ధరకే అందుబాటులోకి ఉన్నాయని చెబుతోంది.

ఇంత తక్కువ ధరకు సాధ్యమేనా..?
రూ.24,999 విలువైన జియో ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.599కే అందించడం సాధ్యమా.  విచిత్రమేమిటంటే అసలు జియోలో ల్యాప్‌టాప్‌ ఇప్పటి వరకు మార్కెట్లోకే రాలేదు. ఇది నకిలీదని.. మరి అత్యంత తక్కువ ధరకి వాళ్లు ఎలా విక్రయిస్తారన్న సందేహం మనకు తప్పకుండా రావాలి. ఇవే కాకుండా ఈ తరహా దోపిడీ చేసే నకిలీ వెబ్‌సైట్లకు చెందిన పలు యాడ్స్‌ ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. అందుకే ఏమరుపాటుగా ఉండటం మన బాధ్యత. తస్మాత్‌ జాగ్రత్త.

మరిన్ని వార్తలు