డాయిష్ బ్యాంక్కు అమెరికా భారీ జరిమానా

17 Sep, 2016 01:57 IST|Sakshi
డాయిష్ బ్యాంక్కు అమెరికా భారీ జరిమానా

14 బిలియన్ డాలర్ల డిమాండ్...

 ఫ్రాంక్‌ఫర్ట్: జర్మనీ దిగ్గజం డాయిష్ బ్యాంక్ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసే పెద్ద చిక్కు వచ్చి పడింది. వివరాల్లోకి వెళితే...  2008కి ముందు రెసిడెంట్ తనఖా ఆధారిత బాండ్లను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడం ద్వారా  ఆర్థిక సంక్షోభానికి తన వంతు కారణమయ్యిందన్న అంశంపై అమెరికా న్యాయశాఖ డాయిష్ బ్యాంకు నుంచి 14 బిలియన్ డాలర్లను తాజాగా డిమాండ్ చేసింది. నిజానికి గత కొంత కాలంలో ఈ అంశానికి సంబంధించి అమెరికా న్యాయశాఖ - బ్యాంక్ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఇంత భారీ మొత్తంలో జరిమానా పడుతుందని డాయిష్ ఊహించకపోవడం తాజా బ్యాంక్ సంక్షోభానికి కారణమయ్యింది.  కేవలం 3.4 బిలియన్ డాలర్ల మేర మాత్రమే డిమాండ్ ఉంటుందని మొదటి నుంచీ డాయిష్ భావిస్తూ వచ్చింది.  అయితే ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తామని, ఆందోళన అక్కర్లేదని  డాయిష్ బ్యాంక్ ప్రకటించింది.

 షేర్ డౌన్...: తాజా పరిణామం బ్యాంక్ షేర్ ధరపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఇప్పటికే ఈ ఏడాది దాదాపు సగం నష్టపోయిన డాయిష్ బ్యాంక్ షేర్ తాజాగా శుక్రవారం 7.6. శాతం పడిపోయింది. తాజా సంక్షోభాన్ని ఎదుర్కొనే దిశలో తన క్యాపిటల్ రేషియో బ్యాలెన్సింగ్ కోసం బ్యాంక్ ఇన్వెస్టర్ల నుంచి మరింత నిధులు సేకరించాల్సి రావచ్చనీ లేదా ఆస్తులూ అమ్మాల్సి రావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

అమెరికా న్యాయశాఖ తన డిమాండ్‌ను సగానికి తగ్గించినా... ఇది  దాదాపు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్న బ్యాంకుకు  భారంగానే ఉంటుందన్నది నిపుణుల ఉద్దేశం.  ఈ సమస్య జర్మనీకి కూడా ఇబ్బందిగా పరిణమించింది.  పరస్పర చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని జర్మనీ ఆర్థిక మంత్రి వోల్ప్‌గాంగ్ వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు