అప్పటి నుంచే గోల్డ్ దిగుమతులు పెరిగాయ్!

15 Apr, 2017 14:03 IST|Sakshi
అప్పటి నుంచే గోల్డ్ దిగుమతులు పెరిగాయ్!
పెద్ద నోట్ల రద్దు అనంతరం బంగారానికి భారీగా డిమాండ్ ఎగిసిన సంగతి తెలిసిందే. బ్లాక్ మనీ హోల్డర్స్ అందరూ తమ నగదును వైట్ గా మార్చేసుకుని, బంగారం కొనుగోలుపై ఎగబడ్డారు. బంగారం కొనుగోళ్లపై ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. అక్రమంగా కొనుగోళ్లు జరిగినట్టు కూడా తెలిసింది. 2013 తర్వాత మొదటిసారి బంగారం దిగుమతులకు బెస్ట్ క్వార్టర్ గా జనవరి-మార్చి 2017 నమోదైనట్టు తెలిసింది. గత క్వార్టర్లో బంగారం దిగుమతలు దాదాపు 230 టన్నులకు పెరిగినట్టు రిపోర్టులు వెల్లడించాయి. కేవలం మార్చిలోనే 100 టన్నులకు పైగా బంగారం దిగుమతి అయిందని పేర్కొన్నాయి. అంటే గతేడాది కంటే మార్చిలో ఏడింతలు దిగుమతులు పెరిగినట్టు బ్లూమ్ బర్గ్ కూడా నివేదించింది. రాబోతున్న పెళ్లిళ్ల సీజన్, ఏప్రిల్ నెలలో అక్షయ తృతియ ఈ దిగుమతులను పెంచినట్టు పేర్కొంది.  2016 ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలంలో 264 టన్నుల బంగారం దిగుమతి కాగ, తర్వాతి  ఐదు నెలల కాలంలో ఏకంగా 360 టన్నులకు పైగా బంగారం దిగుమతి జరిగిందట.
 
గత క్వార్టర్లో బంగారం దిగుమతుల బిల్లులు కూడా పైకి ఎగిసినట్టు రిపోర్టుల్లో తెలిసింది. ఓ వైపు డీమానిటైజేషన్, మరోవైపు బంగారం ధరలు అంతర్జాతీయంగా పెరగడం ఈ బిల్లులపై పడినట్టు నిపుణులు పేర్కొంటున్నారు. నవంబర్ 8న ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడంతో చాలామంది బ్లాక్ మనీ హోల్డర్స్, పాత నోట్లతో బంగారం కొన్నట్టు చెప్పారు. నవంబర్ నెలలోనే 100 టన్నుల దిగుమతులు జరిగాయని నివేదికల్లో వెల్లడైంది. ప్రభుత్వ దాడులతో కొంత మేర దిగుమతులు డిసెంబర్ లో తగ్గిపోయాయి. అనంతరం, ఫిబ్రవరి, మార్చిల్లో ఈ దిగుమతులు మళ్లీ పుంజుకున్నట్టు తెలిసింది. ఏప్రిల్ లోనూ బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుందని కొటక్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ బండారి చెప్పారు.
మరిన్ని వార్తలు