బంగారం... మరింత దిగొచ్చు: నిపుణులు

2 Nov, 2015 02:08 IST|Sakshi
బంగారం... మరింత దిగొచ్చు: నిపుణులు

హైదరాబాద్: పుత్తడి మెరుపులు రానున్న నెలలో మసకబారతాయని నిపుణులంటున్నారు. బంగారం ధరలు వేర్వేరు కారణాల వల్ల ఇప్పుడున్న స్థాయిల నుంచి దిగొస్తాయని వారంటున్నారు.  బంగారం ధరల్లో హెచ్చుతగ్గులున్నప్పటికీ, డిమాండ్ పెరగలేదని,  ఈ ఏడాది రెండో క్వార్టర్‌కు బంగారానికి ప్రపంచవ్యాప్తంగా ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని విశ్లేషకులంటున్నారు. ప్రపంచవ్యాప్త పోకడలకు అనుగుణంగానే ఈ ఏడాది సెప్టెంబర్‌లో మన దేశంలో  బంగారం దిగుమతులు 52 శాతం తగ్గాయి.

మరోవైపు ప్రపంచంలోనే రెందో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా బంగారంపై ఆసక్తిని తగ్గించుకుంటోంది. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను ఈ డిసెంబర్‌లోనే పెంచే అవకాశాలున్నాయనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ వడ్డీరేట్లు పెరిగితే బంగారం ధరలు మరింత పతనమవుతాయి. ఇక సాంకేతికంగా చూసినా, పుత్తడి ధరలకు కష్టకాలమేనని, దీర్ఘకాలిక చార్టులు పరంగా చూసినా ధరలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. రూపాయి బలపడడం కూడా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతోందని వారి అభిప్రాయం.
 
2 వారాల కనిష్టానికి పుత్తడి
అంతర్జాతీయంగా పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడం, రిటైలర్స్, జ్యువెల్లర్స్ నుంచి డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటం వల్ల  అక్టోబర్ 31తో ముగిసిన వారంలో బంగారం ధర రెండు వారాల కనిష్ట స్థాయికి పతనమయ్యింది.  అమెరికా ఫెడరల్ రిజర్వు డిసెంబర్ నెలలో వడ్డీ రేట్లను పెంచుతుందనే ఊహగానాలు కూడా బంగారం ధర పతనానికి ఊతమిచ్చాయి. ముంబైలో అంతక్రితం వారంతో పోలిస్తే 10 గ్రాముల 99.9 స్వచ్ఛత బంగారం ధర వారాంతానికి వచ్చేసరికి రూ.280 పతనమై రూ.26,650కి తగ్గింది. ఒకేవారంలో ఇంత మొత్తం తగ్గుదల ఆగస్టు నెల తర్వాత ఇదే ప్రధమం. ముగిసిన వారంలో అంతర్జాతీయంగా బంగారం ధర 1.8 శాతం క్షీణించింది.

మరిన్ని వార్తలు