పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై గుడ్‌న్యూస్‌..!

26 May, 2018 16:25 IST|Sakshi

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గత కొన్ని రోజుల నుంచి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు స్తబ్ధుగా ఉన్న అనంతరం వరుసగా 13 రోజుల నుంచి మెట్రోపాలిటన్‌ ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడమేనని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్యారల్‌కు 80 డాలర్ల గరిష్ట స్థాయికి చేరిన బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ప్రస్తుతం 2.42 డాలర్లు తగ్గి, 76.37 డాలర్లుగా నమోదైంది. దీంతో ఇక దేశీయంగా కూడా ఇంధన ధరలు తగ్గే అవకాశాలున్నాయని, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రస్తుతం మారుతున్న ధరలు, గ్లోబల్‌ ట్రెండ్‌ మాదిరిగా వచ్చే రోజుల్లో తగ్గబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గితే, వాటి ప్రయోజనాలను వెంటనే వినియోగదారులకు చేరేలా కేంద్రం రోజువారీ ధరల సమీక్ష చేపట్టింది.

ఈ రోజువారీ ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి ఇంధన ధరలు పెరగడమే కానీ, తగ్గుదల మాత్రం చాలా అరుదుగా సంభవించింది. అందుకు కారణం కూడా అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడమే. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతున్నందున్న, దేశీయంగా కూడా వినియోగదారులు గుడ్‌న్యూస్‌ను వినబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాక కాకపుట్టిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని ఇటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. దీంతో కేంద్రం సైతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై త్వరలోనే ఒక దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనబోతుంది. నేడు పెట్రోల్‌ ధర లీటరుకు ఢిల్లీలో రూ.77.97గా, కోల్‌కతాలో రూ.80.61గా, ముంబైలో రూ.85.78గా, చెన్నైలో రూ.80.95గా, హైదరాబాద్‌లో రూ.82.60గా ఉంది. డీజిల్‌ ధర లీటరుకు ఢిల్లీలో రూ.68.90గా, కోల్‌కతాలో రూ.71.45గా, ముంబైలో రూ.73.36గా, చెన్నైలో రూ.72,74గా, హైదరాబాద్‌లో రూ.74.89గా రికార్డైంది.

>
మరిన్ని వార్తలు