దేశీ టెల్కోల్లో..టెక్‌చల్‌!

29 May, 2020 03:48 IST|Sakshi

భారత్‌ టెలికం కంపెనీల్లో అమెరికా టెక్‌ దిగ్గజాల పాగా

జియోలో పెట్టుబడులపై మైక్రోసాఫ్ట్‌ ఆసక్తి

2 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌పై కసరత్తు

ఐడియాలో వాటాలపై గూగుల్‌ కన్ను

5 శాతం కొనుగోలుకు అవకాశం

న్యూఢిల్లీ: దేశీ టెలికం సంస్థల్లో వాటాలు దక్కించుకోవడంపై అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజాలు దృష్టి పెడుతున్నాయి. పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో మైక్రోసాఫ్ట్‌; వొడాఫోన్‌ ఐడియాపై గూగుల్‌ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటి వివరాలు వెల్లడవుతాయని పరిశ్రమవర్గాల సమాచారం.

మైక్రోసాఫ్ట్‌–జియో జోడీ..
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్, టెలికం వ్యాపార విభాగాన్ని విడగొట్టి ఏర్పాటు చేసిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్, అబుధాబికి చెందిన ముబాదలా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ కూడా రంగంలోకి దిగాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లో మైక్రోసాఫ్ట్‌ సుమారు 2.5% వాటాల కోసం దాదాపు 2 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయవచ్చని సమాచారం. దేశీయంగా అతి పెద్ద టెలికం సేవల సంస్థల్లో ఒకటైన జియో కూడా జియో ప్లాట్‌ఫామ్స్‌లో భాగమే.

ఇప్పటిదాకా ఫేస్‌బుక్, సిల్వర్‌ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్‌ అట్లాంటిక్, కేకేఆర్‌ వంటి దిగ్గజాలు దాదాపు 10 బిలియన్‌ డాలర్లపైగా ఇన్వెస్ట్‌ చేసింది. ఈ పెట్టుబడుల ఊతంతో జియోను విదేశాల్లో లిస్టింగ్‌ చేసే యోచనలో కూడా రిలయన్స్‌ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రిలయన్స్‌ జియో, మైక్రోసాఫ్ట్‌ మధ్య ఒక భాగస్వామ్యం ఉంది. క్లౌడ్‌ సేవల మైక్రోసాఫ్ట్‌ అజూర్‌కు సంబంధించి ఒప్పందం ఉంది. మరోవైపు, జియోలో పెట్టుబడులు పెట్టడంపై ముబాదలా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన పెట్టుబడులను బట్టి జియో ప్లాట్‌ఫామ్స్‌ సంస్థ విలువ దాదాపు రూ. 5.61 లక్షల కోట్లుగా ఉంది.

వొడా–గూగుల్‌ జట్టు..
ఆర్థిక సంక్షోభ పరిస్థితులతో సతమతమవుతున్న వొడాఫోన్‌ ఐడియాలో ఇన్వెస్ట్‌ చేయాలని సెర్చి ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 5 శాతం వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని వివరించాయి. మరోపక్క, గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ కూడా అటు జియోలోనూ వాటాలు కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇవి జరుగుతూనే ఉన్నప్పటికీ, డీల్‌ విషయంలో మాత్రం ప్రత్యర్థి సంస్థలతో పోటీలో గూగుల్‌ వెనుకబడిందనేది  పరిశ్రమవర్గాల మాట.

వేల కోట్ల నష్టాలు, రుణాల భారంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారిన వొడాఫోన్‌ ఐడియాలో ఒకవేళ గూగుల్‌ గానీ ఇన్వెస్ట్‌ చేసిన పక్షంలో కంపెనీకి గణనీయంగా ఊరట లభించనుంది. టెలికం శాఖ గణాంకాల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద కేంద్రానికి వొడాఫోన్‌ ఐడియాకు దాదాపు రూ. 53,000 కోట్లు కట్టాల్సి ఉంది. వొడాఫోన్‌ ఐడియాలో ఇన్వెస్ట్‌ చేసిన పక్షంలో జియో సహా ఫేస్‌బుక్‌తో కూడా గూగుల్‌ పోటీ ఎదుర్కొనాల్సి రానుంది. భారత్‌ కోసం ప్రత్యేక ప్రణాళికలు వేస్తూనే ఉన్న గూగుల్‌.. తమ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్, మొబైల్‌ పేమెంట్స్‌ సేవలు మొదలైన మార్గాల్లో దేశీ మార్కెట్లో కార్యకలాపాలు సాగిస్తోంది.

ఎయిర్‌టెల్‌లోనూ విదేశీ పెట్టుబడులు..
టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌లో కూడా ఇటీవలే అంతర్జాతీయ దిగ్గజాలు ఇన్వెస్ట్‌ చేశాయి. ప్రమోటరు సంస్థ భారతి టెలికం ఇందులో  2.75 శాతం వాటాలను విక్రయించింది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సొసైటీ జనరల్, బ్లాక్‌రాక్, నోర్జెస్‌ బ్యాంక్, ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మొదలైనవి వీటిని కొనుగోలు చేశాయి. యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌  ఫండ్, ఎస్‌బీఐ మ్యూచువల్‌  ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వంటి సంస్థలూ వాటాలను దక్కించుకున్నాయి. ఈ షేర్ల విక్రయం ద్వారా భారతి టెలికం రూ. 8,433 కోట్లు సమీకరించింది.

మరిన్ని వార్తలు