కేంద్రం నిధుల వేట వేగవంతం

17 Nov, 2018 00:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల విక్రయం ద్వారా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్లను సమీకరించాలని నిర్ణయించిన కేంద్రం అందుకు ఆపసోపాలు పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా నాలుగు నెలల కాలమే మిగిలి ఉంది. కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకు సమీకరించిన మొత్తం రూ.20,000 కోట్లను దాటలేదు. దీంతో మిగిలిన భారీ లక్ష్యాన్ని తక్కువ వ్యవధిలోనే చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలను వేగవంతం చేస్తోంది.

ఓఎన్‌జీసీ, ఐవోసీ, ఆయిల్‌ ఇండియాల్లో వాటాల అమ్మకం ద్వారా త్వరలోనే రూ15,000 కోట్లకు పైగా సమీకరించాలన్నది ఒక ప్రతిపాదన అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అలాగే, ఇవే కంపెనీల నుంచి షేర్ల బైబ్యాక్‌ ద్వారా మరో రూ.10,000 కోట్లు కూడా రాబట్టుకోవాలన్న (కేంద్రం తన వాటాలను బైబ్యాక్‌లో విక్రయించి) ఆలోచనతో కేంద్రం ఉంది. ప్రస్తుతం ఓఎన్‌జీసీలో 67.48 శాతం, ఐవోసీలో 56.75 శాతం, ఆయిల్‌ ఇండియాలో 66.13 శాతం చొప్పున కేంద్ర ప్రభుత్వానికి వాటాలు ఉన్నాయి.  

నిధుల సమీకరణ...  
ఓఎన్‌జీసీలో 5 శాతం, ఐవోసీలో 3 శాతం, ఆయిల్‌ ఇండియాలో 10 శాతం వాటాలను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో విక్రయించాలన్నది కేంద్రం పరిశీలిస్తున్న ప్రతిపాదన. దీని ప్రకారం ఓఎన్‌జీసీలో వాటాల విక్రయం ద్వారా రూ.10,000 కోట్లు, ఐవోసీ వాటాల అమ్మకంతో రూ.4,200 కోట్లు, ఆయిల్‌ ఇండియాలో వాటాల అమ్మకం ద్వారా రూ.2,300 కోట్లు సమకూరే అవకాశం ఉంది. 

అయితే, కచ్చితంగా ఎంత వాటా విక్రయిస్తారు? ఎన్ని నిధులు సమీకరిస్తారు? అన్నది ఆఫర్‌ ప్రారంభం నాటికే తెలుస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఈ నెల మొదట్లో కోల్‌ ఇండియాలో 3 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా కేంద్రం విక్రయించిన విషయం తెలిసిందే.  

ఆయిల్‌ ఇండియా షేర్ల బైబ్యాక్‌  
ఆఫర్‌ ఫర్‌సేల్‌ మార్గంలో వాటాల అమ్మకంతోపాటు మరోవైపు షేర్ల బైబ్యాక్‌ చేపట్టాలని కూడా కేంద్రం కోరుతోంది. ఈ నేపథ్యంలో బైబ్యాక్‌ ప్రతిపాదన పరిశీలించేందుకు ఈ నెల 19న బోర్డు సమావేశం నిర్వహించనున్నట్టు ఆయిల్‌ ఇండియా తెలిపింది. రూ.1,100 కోట్ల మేర బైబ్యాక్‌ చేపట్టే అవకాశం ఉందని అంచనా.

అలాగే, ఓఎన్‌జీసీ రూ.4,800 కోట్లు, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ రూ.4,000 కోట్ల చొప్పున బైబ్యాక్‌ ఆఫర్‌ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు కోల్‌ ఇండియా షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌ జనవరి చివరికి ఉండొచ్చని అధికార వర్గాల సమాచారం.

మరిన్ని వార్తలు