ఆ రిపోర్ట్లో తప్పుందేమో?

26 Sep, 2016 00:03 IST|Sakshi
ఆ రిపోర్ట్లో తప్పుందేమో?

సిబిల్ స్కోర్ సవరించుకోడానికీ చాన్సుంది
అలా చేస్తేనే క్రెడిట్ స్కోరు పెరుగుదల

రవి బ్యాంక్ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ మంజూరు కాలేదు. కారణం తెలుసుకుని నివ్వెరపోయాడు. గతంలో రుణ చెల్లింపు చరిత్ర సరిగా లేదని సిబిల్ రిపోర్ట్ చెప్పిందని, అందుకనే రుణం మంజూరు చేయలేకపోతున్నామని బ్యాంక్ అధికారి తెలపడమే దీనికి కారణం. రవి ఎప్పుడూ రుణ చెల్లింపుల విషయంలో డిఫాల్ట్ కాలేదు. ఇదే విషయం బ్యాంక్ అధికారికి చెప్పాడు. అయితే మీరు సిబిల్ ఎంట్రీ తప్పులను మార్చుకోవాల్సి ఉంది... అని సలహా ఇచ్చాడు బ్యాంక్ అధికారి. నెల రోజుల్లోనే సమస్యను పరిష్కరించుకోవచ్చన్నది ఆయన సలహా.  అదెలాగో...

ఆ సమస్య మీకూ ఎదురైతే ఏం చేయాలో ఒకసారి చూద్దాం...ఒక్కసారి చూస్తే...అసలు తప్పు ఎలా...?
ఇన్వెస్టర్ పొరపాట్లు లేదా అవగాహనా లోపమే సిబిల్ రిపోర్ట్‌లో తప్పులకు కారణంగా నిలుస్తుంది. చాలా సందర్భాల్లో బ్యాంకులు లేదా మాన్యువల్ తప్పిదాలు కూడా ఇందుకు కారణమవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో కస్టమర్‌కు సంబంధించి కొన్ని రిమార్కుల పరిష్కార అంశాలను సిబిల్‌తో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అప్‌డేట్ చేయవు. ఒక్కొక్కసారి తప్పుగా అప్‌డేట్ జరగవచ్చు. రిపోర్ట్ సందర్భంలో పేరు, అడ్రస్, పుట్టినతేదీ చివరకు లింగభేదం విషయంలో చిన్న తేడా వచ్చినా, రిపోర్ట్ తప్పుగా నమోదయ్యే వీలుంటుంది. అయితే ఇవన్నీ పరిష్కరించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. లేదంటే మనం బ్యాంకింగ్ వివాదాల పరిష్కార వేదిక అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

రిపోర్ట్‌ను సరిచూసుకోడానికి...
ముందుగా జరిగిన తప్పు ఏమిటన్నది రిపోర్ట్‌ను మీరు చూసుకుంటేగానీ తెలియదు. అందువల్ల దీనికోసం దరఖాస్తు పెట్టుకుని, క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. ఇందుకు మీరు చేయాల్సిందేమిటంటే.. ముందుగా సిబిల్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. మీ రిపోర్ట్ పొందడం కోసం తగిన ఫీజు చెల్లించాలి. మీరు ఈ చెల్లింపు జరిపిన మరుక్షణం మీ మెయిల్‌కు పీడీఎఫ్ రూపంలో రిపోర్ట్ అందుతుంది. తద్వారా మీ క్రెడిట్ స్కోర్ తెలుస్తుంది. గతంలో మీకు సంబంధించిన ఎంట్రీలన్నీ సరిగా ఉన్నాయో... లేదో తెలుసుకోవచ్చు.  మీరు ఇంతక్రితం ఏ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారు? చెల్లింపులకు సంబంధించి స్కోర్ ఎలా ఉంది? ఎక్కడ తప్పు జరిగింది వంటి అంశాలను నిశితంగా గమనించాలి.

జరిగిన తప్పు సైట్‌లో రిజిస్టర్...
తప్పు ఎంట్రీ ఏదైనా జరిగితే.. దానిని సిబిల్ దృష్టికి తీసుకువెళ్లడం రెండవ దశ. తప్పుల జాబితాను తయారు చేసుకోండి. తరువాత ‘సిబిల్ వివాదాల పరిష్కారం’ వేదికపై దీనిని నమోదుచేయాలి. ఇందుకు https://www.cibil.com/dispute ఒక వేదికగా ఉంటుంది.  సరిచేయాల్సిన తప్పులను ఎంటర్‌చేయడంతోనే సిబిల్ పరిష్కార వేదిక గతంలో ఇందుకు సంబంధించి లావాదేవీలు జరిపిన బ్యాంక్ బ్రాంచీని సంప్రదిస్తుంది. తప్పులున్నట్లు రుజువైతే... వాటిని సరిదిద్ది, తాజా రిపోర్ట్‌ను రూపొందిస్తుంది. 30 రోజుల్లో మీ రిపోర్ట్ అప్‌డేట్ అవుతుంది. అయితే ఇక్కడ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ఇచ్చిన సమాచారం ప్రాతిపదికనే మీ రిపోర్ట్ అప్‌డేట్ అవుతుందన్నది గమనార్హం.

తప్పు ఉందని తేలితే...
మీరు ఒక బ్యాంక్ బ్రాంచీ నుంచి రుణం తీసుకున్నారు.  కొంత ఇంట్రస్ట్, ఇతర పేమెంట్ చార్జీలు చెల్లించాల్సి ఉంది. స్వల్పమొత్తమేకదా అని మీరు వదిలేశారు. మీ కోసం బ్రాంచ్ ప్రయత్నించింది. మీరు చెల్లించాల్సింది కాస్తా తడిసిమోపెడయ్యింది. మీరు ఎక్కడున్నారో తెలియక, చివరకు బ్యాంక్ చేసేది లేక రైటాఫ్ చేసింది. లేదా సెటిల్ అని రాసేసింది. ఇక్కడ మీకు ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) లేదు. ఇది కూడా మీ సిబిల్ స్కోర్‌కు చిక్కే. ఈ సందర్భంలో మీరు స్వయంగా బ్యాంకుకు వెళ్లి, సమస్య పరిష్కార దిశలో కృషి చేసుకోవచ్చు. తరువాత  ఎన్‌ఓసీ తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. జరిగిన తప్పును సరిచేసుకోవడం ద్వారా సిబిల్ స్కోర్‌ను పెంచుకోవచ్చు.

అంబుడ్స్‌మన్‌నూ ఆశ్రయించవచ్చు..
సిబిల్ స్కోర్‌కు సంబంధించి రుణ దాత తరఫున తప్పు జరిగిన మాట వాస్తవమే. 30 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ గురించి ఎదురుచూశారు. అయితే తగిన స్పందన రాలేదు. రాంగ్ ఎంట్రీ జరిగిన బ్యాంకు బ్రాంచీకి స్వయంగా వెళ్లవచ్చు. సిబిల్  వ్యవహారాలు చూసే అధికారిని సంప్రదించవచ్చు. తగిన సమాధానం పొందలేకపోతే, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేసే వీలుంది. కొంత ఆలస్యమైనా మీ సమస్యను పరిష్కరించుకోడానికి చేసే ఈ ప్రయత్నం భవిష్యత్తులో ఇబ్బందులను తొలగిస్తుంది.  ఒకవేళ తప్పు ఉన్నట్లు బ్యాంక్ స్వయంగా అంగీకరించి, సిబిల్‌కు అప్‌డేట్ చేస్తే మాత్రం 60 నుంచి 90 రోజుల్లో  సమస్య పరిష్కారం అయిపోతుంది.

అసలు స్కోర్ ఎంత ఉండాలి?
సిబిల్ స్కోర్ రేంజ్ 300 నుంచి 900. 750 పైన ఉంటే ఎంతో మంచింది. మీ క్రెడిట్ రేటింగ్ ఎలా ఉందనేది తరచూ పరిశీలించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ఉచితంగా ఈ రిపోర్ట్ పొందవచ్చని ఇటీవలే ప్రభుత్వం ప్రతిపాదించింది. మీ ఆర్థిక జీవనంలో క్రెడిట్ స్కోర్ పాత్ర ఎంతో కీలకమన్న విషయం మర్చిపోవద్దు. ఈ రిపోర్టును మీరు బ్యాంకు నుంచి పొందవచ్చు. లేదా సిబిల్ నుంచీ పొందే వీలుంది.

మరిన్ని వార్తలు