రిజర్వ్ బ్యాంక్‌పై ఆశలు

31 Mar, 2014 00:20 IST|Sakshi
రిజర్వ్ బ్యాంక్‌పై ఆశలు

 న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ రేపు(ఏప్రిల్1) చేపట్టనున్న పరపతి సమీక్ష స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలవనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్‌బీఐ నిర్ణయాలతో సమీప కాలానికి స్టాక్ మార్కెట్ల ట్రెండ్ ప్రభావితం కానున్నదని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు అదే రోజు మార్చి నెలకు వాహన అమ్మకాల వివరాలు వెలువడనున్నాయి. ఫలితంగా ఈ వారం మొదట్లో ఆటో రంగ షేర్లు వెలుగులో నిలవనున్నాయి. ఎక్కువ మంది నిపుణులు పాలసీ రేట్లను యథాతథంగా ఉంచొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే పారిశ్రామిక వర్గాలు వడ్డీ తగ్గింపును ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాలసీ సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది.

 ప్రభుత్వంపై చూపు: మార్కెట్ గమనానికి ఆర్‌బీఐ నిర్ణయంతోపాటు, హెచ్‌ఎస్‌బీసీ పీఎంఐ గణాంకాలూ కీలకంగా నిలవనున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్  ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ చెప్పారు. మరోవైపు ఆటో రంగ అమ్మకాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అవకాశముందని అభిప్రాయపడ్డారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు, రూపాయి కదలికలకూ ప్రాధాన్యత ఉన్నదని పలువురు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు సానుకూలంగా మారాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై మార్కెట్లు దృష్టి నిలిపాయని, అటు ఇన్వెస్టర్లు, ఇటు పారిశ్రామిక రంగానికి మేలు చేకూర్చగల కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయని తెలిపారు.

 ఎఫ్‌ఐఐల జోష్: లోక్‌సభ ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు అధికంగానే ఉన్నాయని విశ్లేషకులు చెప్పారు. ఇందువల్లనే ఎఫ్‌ఐఐలు దేశీ స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారని వివరించారు. ఫలితంగా మార్కెట్లు కొత్త గరిష్టాలను తాకుతున్నాయని తెలిపారు. గడిచిన వారం ఐదు రోజుల్లో ఎఫ్‌ఐఐలు ఏకంగా రూ. 7,000 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు. సెన్సెక్స్ గడిచిన వారంలో 585 పాయింట్లు ఎగసి శుక్రవారానికి 22,340 పాయింట్ల కొత్త ఆల్‌టైమ్ గరిష్టం వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ సైతం 201 పాయింట్లు(3%పైగా) జంప్‌చేసి 6,696 వద్ద కొత్త శిఖరాన్ని అందుకుంది.

మరిన్ని వార్తలు