ఉద్యోగార్థుల్లో నైపుణ్యాలు అంతంతే..

14 Mar, 2019 00:21 IST|Sakshi

ఐబీఎం చీఫ్‌ రోమెటీ 

ముంబై: టెక్నాలజీ రంగంలో కొంగొత్త ఉద్యోగావకాశాలు కుప్పతెప్పలుగా వస్తున్నా.. వాటికి అవసరమైన నైపుణ్యాలు ఉద్యోగార్థుల్లో ఉండటం లేదని అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం ఐబీఎం సీఈవో గినీ రోమెటీ చెప్పారు. విద్యాపరంగా కేవలం డిగ్రీ పట్టా సంపాదించడం మాత్రమే కాకుండా నైపుణ్యాలను పెంచుకోవడంపై ఉద్యోగార్థులు దృష్టి సారించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉందని కంపెనీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గినీ తెలిపారు. 

లక్షల కొద్దీ ఇంజినీర్లు, బిజినెస్‌ స్కూల్‌ గ్రాడ్యుయేట్స్‌లో నాలుగింట మూడొంతుల మందికి ఉద్యోగనైపుణ్యాలు లేవంటూ నివేదికలు చెబుతున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 180 బిలియన్‌ డాలర్ల దేశీ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రస్తుతం సుమారు 40 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. సీఎంఐఈ గణాంకాల ప్రకారం దేశీయంగా 135 కోట్ల జనాభాలో 60 శాతం మంది 35 ఏళ్ల వయస్సులోపు వారు ఉండగా.. 3.12 కోట్ల యువ జనాభా ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. 

మరిన్ని వార్తలు