ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం 34% డౌన్‌

28 Oct, 2017 00:09 IST|Sakshi

క్యూ2లో రూ.2,058 కోట్లు

గణనీయంగా తగ్గిన ఇతర ఆదాయం

మొండి బకాయిలు కనిష్ట స్థాయికి వస్తాయ్‌..

బ్యాంక్‌ ఎండీ చందా కొచర్‌ ఆశాభావం

ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం జూలై– సెప్టెంబర్‌ క్వార్టర్‌లో  34 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.3,102 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 34 శాతం తగ్గి రూ.2,058 కోట్లకు చేరిందని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. రుణ వృద్ధి 6 శాతంగా ఉండటంతో నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.5,709 కోట్లకు పెరిగిందని బ్యాంక్‌ ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ చందా కొచర్‌ చెప్పారు. నికర వడ్డీ మార్జిన్‌ 0.14 శాతం వృద్ధితో 3.27 శాతానికి చేరిందని తెలియజేశారు.

తగ్గిన ఇతర ఆదాయం..
ఇతర ఆదాయం రూ.9,120 కోట్ల నుంచి రూ.5,186 కోట్లకు తగ్గింది. గత క్యూ2లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలో వాటా విక్రయం కారణంగా  రూ.5,682 కోట్ల మేర లాభాలు వచ్చాయని, ఈ క్యూ2లో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీఓలో భాగంగా వాటా విక్రయం ద్వారా రూ.2,012 కోట్లు మాత్రమే వచ్చాయని కొచర్‌ పేర్కొన్నారు.

15 శాతం రుణ వృద్ధి లక్ష్యం...
ఇక ఈ క్యూ2లో రిటైల్‌ రుణాలు 18 శాతం, కార్పొరేట్‌ రుణాలు 4 శాతం, ఎస్‌ఎంఈ రుణాలు 6 శాతం మొత్తం మీద 12.8 శాతం రుణవృద్ధి సాధించామని కొచర్‌ తెలియజేశారు. అంతర్జాతీయ రుణాలు 21 శాతం తగ్గాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో 15 శాతం రుణ వృద్ధి సాధించడం లక్ష్యమని చెబుతూ... కాసా నిష్పత్తి 49.5 శాతానికి పెరిగిందన్నారు. బ్యాంక్‌ టైర్‌–వన్‌ క్యాపిటల్‌ 14.85 శాతంగా ఉందన్నారు. అనుబంధ సంస్థల విషయానికొస్తే, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ నికర లాభం 20 శాతం వృద్ధితో రూ.156 కోట్లకు, బ్రోకరేజ్‌ వ్యాపార విభాగం 32 శాతం వృద్ధితో రూ.131 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్‌ 0.5 శాతం లాభంతో రూ.301 వద్ద ముగిసింది. అయితే ఫలితాలు మార్కెట్‌ ముగిశాక వెలువడ్డాయి.


మిశ్రమంగా ఫలితాలు
ఐసీఐసీఐ బ్యాంక్‌ క్యూ2 ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని విశ్లేషకులంటున్నారు. నికర లాభం అంచనాలను అందుకోలేకపోగా, నికర వడ్డీ ఆదాయం అంచనాలను మించిందని వారంటున్నారు. రుణ నాణ్యత నిలకడగా ఉండడం, ఖాతాల మళ్లింపు లేదని ఆర్‌బీఐ వెల్లడించడంతో సోమవారం ఈ షేర్‌ లాభాల్లో ఉండొచ్చని వారంటున్నారు.


మొండి బకాయిలు గణనీయంగా తగ్గుతాయ్‌...!
ఈ క్వార్టర్‌లో తాజాగా రూ.4,634 కోట్లు మొండి బకాయిలుగా తేలాయని దీంతో స్థూల మొండి బకాయిలు 7.87 శాతానికి పెరిగాయని కొచర్‌ వివరించారు. ఈ క్యూ1లో తాజా మొండి బకాయిలు రూ.4,936 కోట్లు కాగా, గత క్యూ2లో తాజా మొండి బకాయిలు రూ.8,029 కోట్లుగా ఉన్నాయని వివరించారు.

బ్యాంక్‌ తీసుకున్న చర్యల వల్ల తాజా మొండి బకాయిలు తగ్గుముఖం పట్టాయని ఆమె చెప్పారు. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిలు చెప్పుకోదగ్గ కనిష్ట స్థాయికి వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ నివేదించిన మొండి ఖాతాల్లో బ్యాంక్‌కు చెందినవి 30 వరకూ ఉన్నాయని తెలిపారు.

ప్రైవేట్‌ బ్యాంక్‌ల్లో అత్యధిక మొండి బకాయిలు ఉన్న బ్యాంక్‌ ఇదే. మొత్తం కేటాయింపులు రూ.2,483 కోట్ల నుంచి రూ.4,502 కోట్లకు పెరిగాయని కొచర్‌ చెప్పారు. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 4 శాతం పెరిగి 59.3 శాతానికి చేరింది. ఈ క్యూ1లో ఈ కేటాయింపులు రూ.2,609 కోట్లుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు