ధన్‌తేరాస్‌ ధనాధన్‌కు జువెలర్ల వ్యూహాలు

14 Oct, 2017 15:56 IST|Sakshi

కొనుగోళ్లపై డిస్కౌంట్లు, బహుమతులు

పసిడి వెలుగులపై భిన్నాభిప్రాయాలు

‘వెలవెల’కే పలువురు మొగ్గు

ధన్‌తేరాస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని పసిడి భారీ విక్రయాలకు జువెలర్లు ఒకవైపు వ్యూహాలు రూపొందిస్తుండగా,  మరోవైపు కొనుగోళ్లు ఎలా ఉంటాయన్న అంశంపై పరిశ్రమ మదింపు జరుపుతోంది. గత ఏడాదితో పోల్చితే అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని, వస్తు సేవల పన్నుపై ఇంకా కొంత అయోమయ ధోరణి నెలకొనటమే దీనికి ప్రధాన కారణమని కొందరి విశ్లేషణ. అయితే వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా తాము అందిస్తున్న డిస్కౌంట్లు, బహుమతులు అమ్మకాలను పెంచుతాయని మరికొందరు ఆశాభావంతో ఉన్నారు.  ఆయా అంశాలపై నిపుణుల అభిప్రాయాలు చూస్తే...


సెంటిమెంట్‌ బాగుంది కానీ..!
మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగుపడింది.అయితే భారీ కొనుగోళ్లు జరిగిపోతాయని భావించడంలేదు.  స్టోర్స్‌కు వచ్చేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నా, అమ్మకాల పరిమాణం తక్కువగానే ఉండే వీలుంది. కొందరు ఉద్యోగులకు వేతనాల వాయిదా, ఊహించినదానికన్నా తక్కువ బోనస్, అక్రమ ధనార్జనా  నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) పరిధి నుంచి జువెలర్ల తొలగింపుపై అస్పష్టత మార్కెట్‌కు ప్రతికూలంగా ఉన్న అంశాల్లో కొన్ని. ఇక ఆర్థిక మందగమన ధోరణి ఉండనే ఉంది. – ఐబీజేఏ డైరెక్టర్‌ సౌరభ్‌ గాడ్గిల్‌


కొనుగోళ్లు ఊపందుకోవాలి...
మార్కెట్‌ సెంటిమెంట్‌ బాగున్నా, కొనుగోళ్ల పరిమాణం  తక్కువగా ఉండవచ్చు. పీఎంఎల్‌ఏపై నిర్ణయం  కొంత ఊరట కల్పించే అంశమైనా, తక్కువ నగదు సరఫరా మొత్తం సెంటిమెంట్‌ను బలహీన పరుస్తోంది. డీమోనిటైజేషన్‌ ప్రభావం ఇంకా మార్కెట్‌పై కనబడే వీలుంది. కనుక గత ఏడాదికన్నా తక్కువ అమ్మకాలే ఉంటాయని భావిస్తున్నాం. సాధ్యమైనంత తక్కువ డబ్బు పెట్టాలి. నగ బాగుండాలి. ఈ లక్ష్యంతో ‘లైట్‌ వెయిట్‌’ ఆభరణాలకు డిమాండ్‌ బాగుండే వీలుంది. – నితిన్‌ ఖండేల్‌వాల్, జీజేఎఫ్‌


డిమాండ్‌ పెరుగుతుంది...అయితే!
ఈ ఏడాది మొదటి ఆరు నెలలతో పోల్చితే పరిస్థితి మెరుగుపడింది. అయితే పసిడి కొనుగోలుకు సంబంధించిన సెంటిమెంట్‌ మరింత పటిష్టమవ్వాలి. జీఎస్‌టీ అమల్లో అస్పష్టతలు, దక్షిణ కొరియా నుంచి దిగుమతులను నియంత్రణల జాబితాలో పెట్టడం వంటి అంశాలు మార్కెట్‌కు సవాలు విసురుతున్నాయి. కొంతకాలం ఈ సవాళ్లు కొనసాగే అవకాశం ఉంది. ఏదిఏమైనా డిమాండ్‌ పురోగమిస్తుందని నేను చెప్పగలను. గత ఏడాది స్థాయినీ తాకే వీలుంది. – సోమసుందరం పీఆర్, ఎండీ (ఇండియా) డబ్ల్యూజీసీ

మరిన్ని వార్తలు