ఇండిగోకు బాంబు బెదిరింపు

15 Dec, 2018 12:23 IST|Sakshi

ముంబై : ముంబై నుంచి ఢిల్లీ మీదుగా లఖ్‌నవూ వెళ్లాల్సిన ఓ ఇండిగో విమానంలో బాంబు పెట్టారనే సమాచారం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణాన్ని వాయిదా వేసి విమానాన్ని పూర్తిగా తనిఖీలు చేశారు. అనంతరం విమానంలో ఎటువంటి బాంబ్‌ లేదని నిర్ధారించిన తరువాత ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో విమానం శనివారం ఉదయం 6.05 గంటలకు ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి లఖ్‌నవూ బయల్దేరాల్సి ఉంది. అయితే టేకాఫ్‌ అవడానికి ముందు ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ మహిళ విమానాశ్రయం టర్మినల్‌ 1 వద్ద ఉన్న ఇండిగో చెకిన్‌ కౌంటర్‌ దగ్గరకు వెళ్లి.. ఇండిగో 6ఈ 3612(ముంబయి-లఖ్‌నవూ మార్గం) విమానంలో బాంబు ఉన్నట్లు చెప్పారు. అనుమానితులుగా భావిస్తున్న కొందరి ఫొటోలను సాక్ష్యాలుగా చూపించారు. సదరు వ్యక్తులు బాంబు పెట్టి ఉంటారని మహిళ అనుమానం వ్యక్తం చేశారు.

అంతేకాక బాంబు బెదిరింపుల అసెస్‌మెంట్‌ కమిటీ(బీటీఏసీ) కూడా ప్రమాదం జరగొచ్చని అనుమానాలు వ్యక్తం చేయడంతో అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ప్రయాణికులను దింపేసి విమానాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. అయితే విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో విమానానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. రెండు గంటల ఆలస్యం తరువాత ఉదయం 8. 40 గంటలకు ప్రారంభయ్యింది. అనంతరం సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది విచారణ నిమిత్తం సదరు మహిళను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకేళ్లారు.

అయితే ఈ ఘటనపై ఇండిగో ఇంతవరకూ స్పందించలేదు. అంతేకాక ఘటన సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దాని గురించి కూడా సమాచారం లేదు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు