ఐటీలో సీనియర్లు జీతాలు కొంత తగ్గించుకోవాలి

2 Jun, 2017 00:40 IST|Sakshi
ఐటీలో సీనియర్లు జీతాలు కొంత తగ్గించుకోవాలి

అప్పుడే యువ ఉద్యోగుల కొలువులు కాపాడొచ్చు
ఉద్యోగాల కోతపై ఇన్ఫీ మూర్తి


బెంగళూరు: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో  సీనియర్‌ ఉద్యోగులు తమ జీతంలో కొంత త్యాగం చేయగలిగితే యువ ఉద్యోగుల కొలువులను కాపాడినట్లవుతుందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. పరిశ్రమ గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు అనేక సార్లు ఎదుర్కొందని ఒక టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వూ్యలో పేర్కొన్నారు. పరిశ్రమ దిగ్గజాలందరూ ఉద్యోగాల కోత సమస్యను పరిష్కరించాలనే సదుద్దేశంతోనే ఉన్నారని ఆయన చెప్పారు. ‘2008లో.. అంతకన్నా ముందు 2001లోనూ ఇలాంటిదే ఎదురైంది. ఇది కొత్తేమీ కాదు. ఆందోళన అక్కర్లేదు. ఇలాంటి సమస్యలకు గతంలోనూ పరిష్కారాలు కనుగొన్నాం‘ అని పేర్కొన్నారు.

2001లో మార్కెట్‌ కష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు యువత ఉద్యోగాలు కోల్పోకుండా కాపాడేందుకు ఇన్ఫోసిస్‌లో సీనియర్‌ ఉద్యోగులు తమ వేతనాలను కొంత తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకోవడాన్ని ఈ సందర్భంగా మూర్తి ఉదహరించారు. అప్పట్లో చాలా కంపెనీలు నియామకాలను డేట్‌ను వాయిదా వేస్తుంటే తాము మాత్రం 1,500 మంది ఇంజినీర్లకు ఉద్యోగాలు ఆఫర్‌ చేసినట్లు ఆయన తెలిపారు. మరోవైపు, పరిశ్రమ దిగ్గజాలు కొంగొత్త అవకాశాలను గుర్తించాలని, కొత్త టెక్నాలజీలను ఆకళింపు చేసుకునేందుకు యువతకు శిక్షణనివ్వడంపై దృష్టి పెట్టాలని మూర్తి సూచించారు.

మరిన్ని వార్తలు