రూపాయిపై తక్షణ జోక్యం ఉండదు

30 Jun, 2018 00:44 IST|Sakshi

ఆర్‌బీఐపై పూర్తి విశ్వాసం ఉంది

తగిన సమయంలో తగిన నిర్ణయం

ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయెల్‌ వ్యాఖ్యలు

ఫారెక్స్‌ మార్కెట్‌లో కనిష్ట పతనం నుంచి రికవరీ

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి భారీ పతనం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయెల్‌ కీలక ప్రకటన చేశారు. పడిపోతున్న రూపాయిని అడ్డుకోడానికి కేంద్రం తక్షణం చర్యలేవీ తీసుకోదని, ఆ అవసరం కూడా లేదని స్పష్టంచేశారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తరువాత తగిన చర్యలుంటాయని చెప్పారాయన. గురువారం నాడు రూపాయి ఇంట్రాబ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో 69.10 కనిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. తర్వాత ఆల్‌టైమ్‌ కనిష్ఠం 68.79 వద్ద ముగిసింది.

ద్రవ్యోల్బణం, చమురు ధరలు, వాణిజ్య యుద్ధం భయాలు దీనికి కారణం. అయితే శుక్రవారం కొంత కోలుకుని 68.46 వద్ద ముగిసింది. డాలర్ల భారీ విక్రయాల ద్వారా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చేసుకున్న జోక్యంతో ఒక దశలో 68.35 స్థాయిని కూడా రూపాయి చూసింది. నాలుగురోజుల్లో రూపాయి బలపడ్డం ఇదే తొలిసారి. ఆరు కరెన్సీల బాస్కెట్‌ మారకం విలువతో పోల్చి చూసే డాలర్‌ ఇండెక్స్‌ ప్రస్తుతం 95 స్థాయికి చేరి కిందకు పడిపోతోంది. ఆ స్థాయిదాటి నిలబడితే, రూపాయి తక్షణం 72కు చేరడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఆర్‌బీఐపై విశ్వాసం
ఇక్కడ జరిగిన సదస్సులో కేంద్ర మంత్రి గోయెల్‌ మాట్లాడుతూ, ‘‘విదేశీ మారక ద్రవ్యం, రేట్లను నిర్వహించే ఆర్‌బీఐపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. కేంద్రం ఆర్‌బీఐతో ఆయా అంశాలపై చర్చించి తగిన సమయంలో తగిన చర్యలు తీసుకుంటుంది.

2013లో రూపాయి 68ని తాకినపుడు నాటి ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఫారిన్‌ కరెన్సీ నాన్‌– రెసిడెంట్‌ బ్యాంక్‌ (ఎఫ్‌సీఎన్‌ఆర్‌–బీ) డిపాజిట్లను ప్రవేశపెట్టారు. ఈ సమీకరణల ద్వారా అటు తర్వాత మూడేళ్లలో 32 బిలియన్‌ డాలర్లు దేశానికి వచ్చాయి. అటు తర్వాత రేట్లు స్థిరపడ్డాయి. అప్పట్లో వచ్చిన 32 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లను మనం తిరిగి చెల్లించేశాము. గడిచిన ఐదేళ్లూ చూస్తే, రూపాయి బలహీనత సమస్య తలెత్తలేదు.’’ అని అన్నారు.
 
అప్పుడు దేశీయం... ఇప్పుడు అంతర్జాతీయం
‘‘స్థూల ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే, 2013 సంవత్సరంలో భారత్‌ వద్ద విదేశీ మారక నిల్వలు 304 బిలియన్‌ డాలర్లే ఉండేవి. 2017–18 నాటికి ఈ నిల్వలు 425 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి’’ అని గోయెల్‌ ఒక సమావేశంలో చెప్పారు.

‘‘ఇక 2012–13లో కరెంట్‌ అకౌంట్‌ లోటు (ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశానికి వచ్చీ వెళ్లే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) కూడా 4.8 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇది 1.9 శాతమే. అదే విధంగా ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం కూడా ఈ కాలంలో 4.5% నుంచి 3.5%కి తగ్గింది’’ అని కేంద్ర మంత్రి వివరించారు.

వీటి ప్రకారం.. మన స్థూల ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు 2013తో పోల్చితే ఎంతో మెరుగ్గా ఉన్నాయని మంత్రి అన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కొంత ప్రతికూల పరిస్థితి ఉందన్నారు. ప్రత్యేకించి ఇప్పుడు చమురు ధరలు తీవ్ర స్థాయికి చేరాయని ఈ సందర్భంగా తెలిపారు. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపుదల సమస్యా ఉందన్నారు. దీనివల్ల దేశం నుంచి మూలధన పెట్టుబడులు వెనక్కు మళ్లుతున్నాయని వివరించారు.   

రూపాయి కుదుపులను అడ్డుకోగలం:గార్గ్‌
ఇదిలావుండగా, ప్రస్తుత రూపాయి ఒడిదుడుకులను ఎదుర్కొనగల శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గార్గ్‌ పేర్కొన్నారు. ఇందుకు తగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు దేశం వద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 2013 సంవత్సరంలో ఉన్నదాని కన్నా భిన్నమైన ధోరణి ఉందని అన్నారు.   


నల్లధనం అని తేలితే కఠిన చర్యలు
గత ప్రభుత్వం వల్లే స్విస్‌ డిపాజిట్ల పెరుగుదల
స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు పెరగడానికి మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రవేశపెట్టిన ఉదారవాద రెమిటెన్స్‌ స్కీమ్‌ కారణం అయి ఉండొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అభిప్రాయపడ్డారు. స్విస్‌ బ్యాంకుల్లో ఉన్నదంతా నల్లధనం అని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. భారతీయల డిపాజిట్ల వివరాలను ద్వైపాక్షిక పన్ను ఒప్పందం కింద వచ్చే ఏడాది నుంచి తీసుకోవడం ప్రారంభిస్తామని, ఏవైనా అవకతవకలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2017లో 50 శాతం పెరిగి రూ.7,000 కోట్లుగా నమోదయినట్లు గురువారం స్విస్‌ నేషనల్‌ బ్యాంకు విడుదల చేసిన గణాంకాలు తెలియజేశాయి. అంతకు ముందు వరుసగా మూడేళ్లు భారతీయుల డిపాజిట్లు తగ్గగా... గతేడాది మళ్లీ పెరగడం గమనార్హం. దీంతో మీడియా ప్రశ్నలకు పీయూష్‌ గోయల్‌ స్పందించారు. ‘‘మీరు ప్రస్తావించిన డేటా మా దృష్టికి రావాల్సి ఉంది. దీన్ని నల్లధనం లేదా అక్రమ లావాదేవీలని ఎలా చెప్పగలరు?’’ అని మంత్రి ప్రశ్నించారు.

మీడియా నివేదికలను ప్రస్తావించిన ఆయన, 40% డిపాజిట్లు చిదంబరం ప్రవేశపెట్టిన రెమిటెన్స్‌ స్కీమ్‌ వల్లే పెరిగాయని చెప్పారు. ఉదారవాద రెమిటెన్స్‌ స్కీమ్‌ కింద ఒక్కో వ్యక్తి ఒక ఏడాదిలో 2.5 లక్షల డాలర్లను విదేశాలకు పంపుకోవచ్చని మంత్రి చెప్పారు. ‘‘సమాచారమంతా మా చేతికి వస్తుంది. ఎవరైనా నేరం చేసినట్టు తేలితే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది’’ అని పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు