మరింత సంక్షోభంలో జెట్‌

12 Apr, 2019 11:33 IST|Sakshi

మరో 10 విమానాల నిలిపివేత

లీజు కట్టకపోవడమే కారణం

26% వాటాలు తనఖా పెట్టిన నరేష్‌ గోయల్‌

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతోంది. తాజాగా లీజు అద్దెలు చెల్లించకపోవడంతో మరో 10 విమానాలు నిలిపివేయాల్సి వచ్చినట్లు సంస్థ గురువారం వెల్లడించింది. దీంతో ఇలా నిల్చిపోయిన విమానాల సంఖ్య 79కి చేరింది. అయినప్పటికీ కార్యకలాపాలు సజావుగా సాగించే క్రమంలో నిధుల సమీకరణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు జెట్‌ పేర్కొంది. మరోవైపు, జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేష్‌ గోయల్‌ 26 శాతం వాటాలను తనఖా పెట్టారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నుంచి జెట్‌ ఎయిర్‌వేస్‌ తీసుకున్న రుణాలకు గాను 2.95 శాతం షేర్లు (26.01 శాతం వాటాలు) ఏప్రిల్‌ 4న తనఖా ఉంచినట్లు కంపెనీ వెల్లడించింది. రుణాల పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక ప్రకారం బ్యాంకులు జెట్‌ ఎయిర్‌వేస్‌ను తమ చేతుల్లోకి తీసుకున్న నేపథ్యంలో కంపెనీ చైర్మన్‌ హోదా నుంచి గోయల్‌ తప్పుకున్న సంగతి తెలిసిందే.

విదేశీ సేవల కొనసాగింపుపై కేంద్రం దృష్టి..
జెట్‌ విమానాల సంఖ్య 14కి తగ్గిపోయిన నేపథ్యంలో అంతర్జాతీయ కార్యకలాపాలు కొనసాగించేందుకు సంబంధించి కంపెనీకి గల అర్హతలను ప్రభుత్వం పునఃసమీక్షించే అవకాశాలు ఉన్నాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా తెలిపారు. వాస్తవ పరిస్థితుల గురించి జెట్‌ నుంచి అన్ని వివరాలు సేకరించాలంటూ నియంత్రణ సంస్థ డీజీసీఏకు సూచించడం జరిగిందని, నివేదిక వచ్చాక తగు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ రూట్లలో విమానాలు నడపాలంటే దేశీ ఎయిర్‌లైన్స్‌కు కనీసం 20 విమానాలు ఉండాలి. జెట్‌ దగ్గర ఒకప్పుడు 123 పైచిలుకు విమానాలు ఉన్నప్పటికీ.. సంఖ్య ప్రస్తుతం 14కి తగ్గిపోయింది. రుణభారం దాదాపు రూ. 8,000 కోట్ల మేర పేరుకుపోయింది. 

వాటాల రేసులో నరేష్‌ గోయల్‌ కూడా..
జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటాల కొనుగోలు రేసులో మాజీ చైర్మన్‌ నరేష్‌ గోయల్‌ కూడా పోటీపడనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన కూడా బిడ్‌ దాఖలు చేసే అవకాశం ఉందని వివరించాయి. ఇందుకు నిబంధనలు కూడా అనుమతిస్తున్నట్లు తెలిపాయి.  నరేష్‌ గోయల్‌ సహా ఎవరైనా సరే బ్యాంకుల కన్సార్షియం విక్రయిస్తున్న వాటాల కొనుగోలుకు పోటీపడొచ్చంటూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ రజనీష్‌ గోయల్‌ ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో గోయల్‌ కూడా పోటీలో ఉంటారన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌లో 31–75% దాకా వాటాలు విక్రయిస్తున్న బ్యాంకుల కన్సార్షియం బిడ్స్‌ దాఖలుకు గడువును ఏప్రిల్‌ 12కి పొడిగించింది.

ఈశాన్య రాష్ట్రాలకు సేవలు నిలిపివేత..
మరోవైపు, తూర్పు, ఈశాన్య భారతంలోని ప్రాంతాలకు జెట్‌ సర్వీసులు నిలిపివేసినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. దీంతో కోల్‌కతా, పాట్నా, గౌహతి తదితర ప్రాంతాలకు జెట్‌ విమానసేవలు ఆగిపోయాయని పేర్కొన్నాయి. నిర్వహణపరమైన కారణాలతో కోల్‌కతా–గౌహతి, ముంబై–కోల్‌కతా, డెహ్రాడూన్‌–గౌహతి (వయా కోల్‌కతా) మధ్య సేవలను శుక్రవారం (ఏప్రిల్‌ 12న) నిలిపివేస్తున్నట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ వివరణనిచ్చింది.  అలాగే ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు నుంచి లండన్, ఆమ్‌స్టర్‌డామ్, ప్యారిస్‌కు ఏప్రిల్‌ 12న నడపాల్సిన విమాన సేవలను నిర్వహణపరమైన కారణాల వల్ల నిలిపివేస్తున్నట్లు జెట్‌ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు