61 శాతం పెరిగిన కర్ణాటక బ్యాంక్‌ లాభం 

12 Jan, 2019 02:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని కర్ణాటక బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.140 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.87 కోట్ల నికర లాభం వచ్చిందని, 61 శాతం వృద్ధి సాధించామని కర్ణాటక బ్యాంక్‌ తెలిపింది. నిర్వహణ, ఇతర  ఆదాయాలు బాగా పెరగడంతో ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని తెలియజేసింది. నికర వడ్డీ ఆదాయం రూ.451 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.488 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇతర ఆదాయం 55 శాతం ఎగసి రూ.301 కోట్లకు,  నిర్వహణ లాభం 24 శాతం ఎగసి రూ.400 కోట్లకు పెరిగాయని వివరించింది.  

పెరిగిన కేటాయింపులు.. 
రుణ నాణ్యత నిలకడగా ఉన్నా, కేటాయింపులు మాత్రం పెరిగాయి. గత క్యూ3లో 3.96 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.45 శాతానికి పెరిగాయని కర్ణాటక బ్యాంక్‌ పేర్కొంది. నికర మొండి బకాయిలు 2.85 శాతం నుంచి 3 శాతానికి చేరాయని వివరించింది. కేటాయింపులు 6 శాతం పెరిగి రూ.209 కోట్లకు చేరగా, ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 57.5 శాతం నుంచి  57.2 శాతానికి తగ్గింది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్‌ఈలో కర్నాటక బ్యాంక్‌ షేర్‌ 0.6 శాతం లాభపడి రూ.116 వద్ద ముగిసింది.  

>
మరిన్ని వార్తలు