కోటక్‌ బ్యాంకు లాభం 21% వృద్ధి 

25 Oct, 2018 01:03 IST|Sakshi

క్యూ2లో రూ.1,747 కోట్లుగా నమోదు

ఆదాయం రూ.10,829 కోట్లు

పెరిగిన ఆస్తుల నాణ్యత...  తగ్గిన ఎన్‌పీఏలు

న్యూఢిల్లీ: కోటక్‌ మహీంద్రా బ్యాంకు సెప్టెంబర్‌ క్వార్టర్‌కు సంబంధించి ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ (బ్యాంకుతో పాటు ఇతర సబ్సిడరీలు కలసి) లాభం 21.3 శాతం వృద్ధితో రూ.1,747 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం సైతం రూ.10,829 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,440 కోట్లు, ఆదాయం రూ.9,140 కోట్లుగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయం, ఫీజుల ద్వారా ఆదాయం పెరగడం కలిసొచ్చింది. కానీ, బ్యాంకు నికర వడ్డీ మార్జిన్‌ మాత్రం 4.4 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గింది. బ్యాంకు ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. స్థూల ఎన్‌పీఏలు 1.91 శాతానికి తగ్గాయి. క్రితం ఏడాది సెప్టెంబర్‌ క్వార్టర్లో ఇవి 2.14 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా చూస్తే స్థూల ఎన్‌పీఏల మొత్తం రూ.4,302 కోట్లు. నికర ఎన్‌పీఏలు సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 1.08 శాతం (రూ.2,036 కోట్లు) నుంచి 0.73 శాతానికి (1,617 కోట్లు) తగ్గుముఖం పట్టాయి. ఎన్‌పీఏలు, కంటింజెన్సీలకు చేసిన నిధుల కేటాయింపులు సైతం రూ.359 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ కేటాయింపులు రూ.252 కోట్లుగా ఉండడం గమనార్హం. అడ్వాన్స్‌లు, ఇతరత్రా వాటికి చేసిన నిధుల కేటాయింపులు రూ.221 కోట్లుగా ఉన్నట్టు కోటక్‌ బ్యాంకు తెలిపింది. ఆగస్ట్‌ 2న 8.10 శాతం పర్పెచ్యుయల్‌ నాన్‌ కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లను అర్హులైన ఇన్వెస్టర్లకు కేటాయించడం వల్ల బ్యాంకు పెయిడప్‌ క్యాపిటల్‌ పెరిగినట్టు పేర్కొంది.
 
అంచనాలకు సమీపంలో... 
స్టాండలోన్‌గా చూసుకుంటే కోటక్‌ మహీంద్రా బ్యాంకు నికర లాభం 15 శాతం పెరిగి రూ.1,141 కోట్లకు చేరింది. కానీ, అనలిస్టులు మాత్రం రూ.1,200 కోట్ల స్థాయిల్లో ఉంటుందని అంచనా వేశారు. ఆదాయం రూ.5,714 కోట్ల నుంచి రూ.7,016 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్‌గా బ్యాంకు వద్ద మిగులు నిల్వలు, క్యాపిటల్‌ రూ.54,349 కోట్లకు వృద్ధి చెందాయి. సెప్టెంబర్‌ చివరి నాటికి కన్సాలిడేటెడ్‌గా ఇచ్చిన రుణాల మొత్తం రూ.2.22 లక్షల కోట్లుగా ఉన్నట్టు బ్యాంకు తెలిపింది. బీఎస్‌ఈలో కోటక్‌ బ్యాంకు షేరు 1.75 శాతం తగ్గి రూ.1,157.10 వద్ద క్లోజయింది.  

ముఖ్యాంశాలివీ... 
రిటైల్‌ రుణాలు 27.77 శాతం పెరిగి రూ.78,167 కోట్లకు చేరాయి. రెండో త్రైమాసికంలో బ్యాంకు మొత్తం రుణాల్లో రిటైల్‌ రుణాల వాటా 42 శాతంగా ఉంది. కార్పొరేట్‌ రుణాలు 17% పెరిగి రూ.1,06,773 కోట్లకు చేరాయి.   డిపాజిట్లు 24% వృద్ధితో రూ.2.06 లక్షల కోట్లు.     ఇతర ఆదాయం వార్షికంగా 26 శాతం పెరిగి రూ.1,205 కోట్లకు చేరింది. 

>
మరిన్ని వార్తలు