-

గతవారం బిజినెస్‌

31 Jul, 2017 00:47 IST|Sakshi
గతవారం బిజినెస్‌

సలాసర్‌ బ్లాక్‌బ్లస్టర్‌ లిస్టింగ్‌
స్మాల్‌ క్యాప్‌ కంపెనీ సలాసర్‌ టెక్నో ఇంజనీరింగ్‌ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. ఐపీవో ఆఫర్‌ ధరపై లిస్టింగ్‌రోజే ఏకంగా 152% లాభాలనిచ్చింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ. 108  కేటాయించింది. ఐపీవో సైజు కేవలం 33.21 లక్షల షేర్లే. దీని ద్వారా కంపెనీ రూ.35.86 కోట్లు సమీకరించింది.

రీట్స్‌కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌
వ్యాపార నిర్వహణ సులభతరం చేసే దిశగా రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లు (రీట్స్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టులకు (ఇన్విట్స్‌) ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు సెబీ తెలిపింది. దీంతో రీట్స్, ఇన్విట్స్‌ మరింత త్వరితగతిన, తక్కువ వ్యయాల భారంతో రిజిస్ట్రేషన్, ఇతరత్రా ఫైలింగ్స్‌ ప్రక్రియలు పూర్తి చేయవచ్చని పేర్కొంది.

 4 కేజీల గోల్డ్‌ బాండ్లు కొనొచ్చు
బంగారం బాండ్లలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో (ఎస్‌జీబీ) వార్షిక పెట్టుబడుల పరిమితిని భారీగా పెంచింది. ప్రస్తుతం 500 గ్రాముల మేరకు మాత్రమే పెట్టుబడి పెట్టే వీలుండగా... దీన్ని ఏకంగా 4 కిలోలకు పెంచింది. తాజా నిర్ణయం ప్రకారం, ఒక వ్యక్తి లేదా హిందూ అవిభక్త కుటుంబం వార్షికంగా 4 కేజీల వరకూ గోల్డ్‌ బాండ్‌పై పెట్టుబడిపెట్టే వీలుంది.  

అల్ఫాబెట్‌ బోర్డులోకి సుందర్‌ పిచాయ్‌
ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తాజాగా కంపెనీ మాతృసంస్థ అల్ఫాబెట్‌ బోర్డులో డైరెక్టరుగా చోటు దక్కించుకున్నారు. కాగా చెన్నైకి చెందిన సుందర్‌ పిచాయ్‌.. 2004లో గూగుల్‌లో చేరారు. 2015 ఆగస్టులో గూగుల్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.

కొత్త కుబేరుడు బెజోస్‌
అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌.. ప్రపంచ కుబేరుల జాబితా లో అగ్రస్థానానికి చేరారు. ఈ క్రమంలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ను కూడా దాటేశారు. ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందు గత గురువారం అమెజాన్‌ షేరు ధర ఒక్కసారిగా దూసుకుపోవడంతో... బెజోస్‌ సంపద నికర విలువ ఏకంగా 90.9 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది. బిల్‌ గేట్స్‌ సంపద 90.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

 బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదే..
దేశంలో రూ.10,000లోపు బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌లో షావోమి అగ్రస్థానం దక్కించుకుంది. 2017 రెండో త్రైమాసికానికి సంబంధించి రీసెర్చ్‌ సంస్థ కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. షావోమికి చెందిన ’రెడ్‌మి నోట్‌4’, ’రెడ్‌మి4’ స్మార్ట్‌ఫోన్లు వరుసగా 7.2 %, 4.5% మార్కెట్‌ వాటాతో తొలి రెండు స్థానాలను ఆక్రమించాయి. ఇక 4.3% వాటాతో శాంసంగ్‌ ’గెలాక్సీ జే2’ మూడో స్థానంలో ఉంది. ఒప్పొ ఏ37, శాంసంగ్‌ గెలాక్సీ జే7 వరుసగా 3.5%, 3.3% వాటాలతో నాలుగు, ఐదో స్థానంలో ఉన్నాయి.  

సుప్రీంకోర్టులో స్పైస్‌జెట్‌కు చుక్కెదురు
స్పైస్‌జెట్‌కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. స్పైస్‌జెట్‌కు, ఆ సంస్థ పూర్వపు యజమాని కళానిధి మారన్‌కు మధ్య షేర్ల కేటాయింపు విషయమై నెలకొన్న వివాదంలో రూ.579 కోట్లు డిపాజిట్‌ చేయాలంటూ గత నెలలో ఢిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును స్పైస్‌జెట్‌ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ అప్పీల్‌ను తిరస్కరిస్తున్నట్టు, ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు