ఎల్‌అండ్‌టీ ఇన్ఫో లాభం 33% వృద్ధి 

19 Jan, 2019 00:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లార్సన్‌ అండ్‌ టూబ్రో ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ) నికర లాభం సుమారు 33 శాతం వృద్ధి చెంది రూ.375.5 కోట్లకు చేరింది. 2017 అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో ఇది రూ. 282.8 కోట్లు. క్యూ3లో ఆదాయం 31 శాతం పెరిగి రూ. 1,884 కోట్ల నుంచి రూ. 2,473 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన చూస్తే నికర లాభం రూ. 400 కోట్ల నుంచి సుమారు 7 శాతం మేర క్షీణించగా, ఆదాయం మాత్రం రూ. 2,331 కోట్ల నుంచి 6 శాతం వృద్ధి సాధించింది. 2018 డిసెంబర్‌ ఆఖరు నాటికి కంపెనీలో మొత్తం సిబ్బంది సంఖ్య 27,513గా ఉంది.

ఎన్‌ఐఐటీ ఆదాయం రూ. 972 కోట్లు 
న్యూఢిల్లీ: ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ. 972 కోట్ల ఆదాయంపై రూ. 100  కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే లాభం 33%, ఆదాయం 29% పెరిగాయి. 2017–18 క్యూ3లో ఆదాయం లాభం రూ. 76 కోట్లు. వివిధ మార్కెట్లలో విభాగాలన్నీ మెరుగ్గా రాణించడంతో ఆదాయం భారీగాగా పెంచుకోగలిగామని ఎన్‌ఐఐటీ టెక్‌ వైస్‌ చైర్మన్, ఎండీ అరవింద్‌ ఠాకూర్‌ తెలిపారు.

ఐసీఐసీఐ లాంబార్డ్‌ జీఐ లాభం 239 కోట్లు 
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ నికర లాభం సుమారు 3 శాతం వృద్ధి చెంది రూ. 239 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 232 కోట్లు. మరోవైపు మొత్తం ఆదాయం రూ. 2,020 కోట్ల నుంచి రూ. 2,416 కోట్లకు చేరింది. 2019 మే 1 నుంచి మరో అయిదేళ్ల పాటు భార్గవ్‌ దాస్‌గుప్తాను ఎండీ, సీఈవోగా కొనసాగించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది.

ఎస్‌బీఐ లైఫ్‌ లాభంలో 15% వృద్ధి 
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఎస్‌బీఐ లైఫ్‌ నికర లాభం 15 శాతం వృద్ధి చెంది రూ. 264 కోట్లకు చేరింది. ఇది అంతక్రితం క్యూ3లో రూ.230 కోట్లు. ఆదాయం రూ.9,586 కోట్ల నుంచి రూ.12,156 కోట్లకు పెరిగింది. ఏయూఎం రూ. 1,11,630 కోట్ల నుంచి రూ. 1,34,150 కోట్లకు చేరింది.    

మరిన్ని వార్తలు