మేడ్ ఇన్ ఇండియా సెల్‌కాన్ మొబైల్స్

27 Jun, 2015 01:47 IST|Sakshi
మేడ్ ఇన్ ఇండియా సెల్‌కాన్ మొబైల్స్

 హైదరాబాద్, బిజనెస్ బ్యూరో : సెల్‌ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్ మొబైల్స్ హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద ఏర్పాటు చేసిన అసెంబ్లింగ్ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ ప్లాంటును శుక్రవారం ప్రారంభించారు. తొలుత నెలకు 2 లక్షల ఫోన్లను అసెంబుల్ చేయనున్నారు. ఈ సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్ల స్థాయికి చేర్చనున్నారు. దేశీ యంగా తయారీతో మోడళ్ల ధర 7-8 శాతం తగ్గనుంది.  ఇప్పటి వరకు మేడ్ ఇన్ చైనా పేరుతో వచ్చిన కంపెనీ ఫోన్లు ఇక నుంచి మేడ్ ఇన్ ఇండియాగా కూడా రానున్నాయని సెల్‌కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. దక్షిణాదిన అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటవడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఇతర కంపెనీలూ దక్షిణాదికి వచ్చేం దుకు మార్గం సుగమం అయిందని అన్నారు.

 అన్ని మోడళ్లు ఇక్కడే..
 ప్రస్తుతం నాలుగు బేసిక్ ఫోన్లను మేడ్చల్ ప్లాంటులో అసెంబుల్ చేస్తున్నారు. జూలై నుంచి స్మార్ట్‌ఫోన్లు కూడా వీటికి తోడవనున్నాయి. ఆరు నెలల్లో అన్ని మోడళ్లు ఇక్కడే అసెంబుల్ చేస్తామని గురు పేర్కొన్నారు. ‘నాణ్యతకు పెద్ద పీట వేస్తున్నాం. ల్యాబ్‌లో పరీక్షించాకే ఫోన్లను బయటకు తీసుకొస్తున్నాం. చైనాకు చెందిన నిపుణుల బృందం ఇక్కడే ఉండి తయారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇందుకు వ్యయం పెరిగినా భారత్‌లో తయారీని చేపట్టాలన్న ఏకైక లక్ష్యంతో సాగుతున్నాం’ అని చెప్పారు.

మేడ్చల్‌తోపాటు ప్రతిపాదిత మొబైల్స్ తయారీ హబ్‌లో ఏర్పాటు చేయనున్న ప్లాంటుకు కలిపి రూ.250 కోట్లు వెచ్చిస్తామని తెలిపారు. మేడ్చల్ ప్లాంటులో 200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 100 మంది శిక్షణలో ఉన్నారు. మరో 900 మందిని నియమించనున్నా రు. ప్లాంటు స్థాపించాలన్న తమ మూడేళ్ల కల నెరవేరిందని సెల్‌కాన్ ఈడీ మురళి రేతినేని అన్నారు. నెలకు 7 లక్షల హ్యాండ్‌సెట్లు విక్రయిస్తున్నామని, దీన్ని 10 లక్షలకు తీసుకెళ్తామని చెప్పారు.

 మరిన్ని కంపెనీలు..: మొబైల్స్ తయారీ రంగంలో తెలంగాణలో ఇది ఆరంభం మాత్రమేనని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. సెల్‌కాన్ ప్లాంటు ఏర్పాటవడం గర్వంగా ఉందన్నారు. మరిన్ని మొబైల్ కంపెనీలు ప్లాంట్ల స్థాపనకు సుముఖంగా ఉన్నాయని చెప్పారు. ‘మొబైల్స్ తయారీ హబ్ ఏర్పాటుకు సీఎం కె.చంద్రశేఖర రావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ సైతం సుముఖంగా ఉంది. మైక్రోమ్యాక్స్ ప్లాంటు రాబోతోంది. తైవాన్ కంపెనీలను ఆహ్వానించాం. కొరియా, జపాన్‌కు త్వరలో వెళ్తాం. మానవ వనరుల శిక్షణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది’ అని చెప్పారు. అనలాగ్ ఫ్యాబ్ యూనిట్ ఏర్పాటుకై యూఎస్‌కు చెందిన క్రికెట్ సెమికండక్టర్ కంపెనీతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు