ప్యాసింజర్‌ విభాగంలో మారుతీ ఆధిపత్యం

11 Jul, 2018 00:20 IST|Sakshi

52.54 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానం

2, 3 స్థానాల్లో వరుసగా హ్యుందాయ్, మహీంద్రా

న్యూఢిల్లీ: దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’.. దేశీ ప్యాసింజర్‌ వాహన విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 52.54 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టాటా మోటార్స్‌ మార్కెట్‌ వాటా పరంగా హోండా కార్స్‌ను వెనక్కునెట్టి నాల్గో స్థానాన్ని దక్కించుకుంది. ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ సమాఖ్య (సియామ్‌) ప్రకారం.. ఏప్రిల్‌– జూన్‌ మధ్యకాలంలో మొత్తం దేశీ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 19.91 శాతం వృద్ధితో 7,28,483 యూనిట్ల నుంచి 8,73,501 యూనిట్లకు పెరిగాయి.

మారుతీ విక్రయాలు 24.93 శాతం వృద్ధితో 4,58,967 యూనిట్లకు ఎగశాయి. మార్కెట్‌ వాటా 50.43 శాతం నుంచి 52.54 శాతానికి చేరింది. దీంతో ఇది అగ్రస్థానంలో నిలిచింది. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా అమ్మకాలు 10.28 శాతం వృద్ధితో 1,37,114 యూనిట్లకు పెరిగినా.. మార్కెట్‌ వాటా మాత్రం 17 శాతం నుంచి 15.69 శాతానికి తగ్గింది. దీంతో ఇది రెండో స్థానంలోనే ఉంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు 60,539 యూనిట్లుగా నమోదయ్యాయి.

విక్రయాల్లో 8.52 శాతం వృద్ధి కనిపించినా.. మార్కెట్‌ వాటా మాత్రం 7.65 శాతం నుంచి 6.93 శాతానికి క్షీణించింది. దీంతో ఇది మూడో స్థానంలో నిలిచింది. టాటా మోటార్స్‌ విక్రయాల్లో ఏకంగా 48.5 శాతం వృద్ధి నమోదయ్యింది. అమ్మకాలు 39,708 యూనిట్ల నుంచి 58,969 యూనిట్లకు పెరిగాయి. సంస్థ మార్కెట్‌ వాటా 5.45 శాతం నుంచి 6.75 శాతానికి ఎగసింది.

మరిన్ని వార్తలు