టాటా హారియర్, సఫారి కొత్త వర్షన్స్‌ విడుదల.. కర్వ్‌ వచ్చే ఏడాదే..

18 Oct, 2023 08:34 IST|Sakshi

న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ రెండేళ్లలో మరో రెండు స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ (ఎస్‌యూవీ) భారత్‌లో ప్రవేశపెడుతోంది. వీటిలో కర్వ్, సియెరా మోడళ్లు ఉన్నాయని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ ఎండీ శైలేష్‌ చంద్ర వెల్లడించారు. వీటి చేరికతో కంపెనీ ఎస్‌యూవీ శ్రేణికి మరింత బలం చేకూరుతుందన్నారు. ఎస్‌యూవీలైన హారియర్, సఫారి కొత్త వర్షన్స్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘హారియర్, సఫారి కొత్త వర్షన్స్‌ గ్లోబల్‌ ఎన్‌సీఏపీ నుంచి అత్యుత్తమ భద్రతా రేటింగ్స్‌ను పొందాయి. 5–స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌తో భారతీయ కంపెనీలకు చెందిన వాహనాల్లో అత్యధిక స్కోర్‌తో టాటా ఎస్‌యూవీలు ఇక్కడి రోడ్లపై అత్యంత సురక్షితమైన మోడళ్లుగా ఉన్నాయి’ అని వివరించారు. ఎక్స్‌షోరూంలో హారియర్‌ కొత్త వర్షన్‌ రూ.15.49 లక్షలు, సఫారి రూ.16.19 లక్షల నుంచి ప్రారంభం.  

ఎస్‌యూవీ విభాగంలో పోటీ.. 
స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ దేశీయ ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) వృద్ధిని నడిపిస్తున్నాయి. సియామ్‌ గణాంకాల ప్రకారం మొత్తం పీవీల్లో ఎస్‌యూవీల వాటా ఏకంగా 60 శాతానికి చేరింది. చాలా కాలంగా ఎస్‌యూవీ విభాగంలో అగ్ర స్థానంలో ఉన్నామని శైలేష్‌ తెలిపారు. పంచ్, నెక్సన్‌ సెగ్మెంట్‌ లీడర్లుగా ఉన్నాయని వెల్లడించారు. హారియర్, సఫారి ద్వయం ఇవి పోటీ పడుతున్న విభాగంలో రెండవ స్థానంలో ఉన్నాయని చెప్పారు. ‘ఇతర కంపెనీలు కొన్ని కొత్త మోడళ్లను విడుదల చేశాయి.

ర్యాంకింగ్‌ మారుతూనే ఉంటుంది. ఇక్కడ నంబర్‌ వన్‌ అనేది స్పష్టంగా లేదు. ఈ సెగ్మెంట్‌లో తీవ్ర పోటీ ఉండబోతోంది. మొదటి మూడు–నాలుగు కంపెనీల అమ్మకాల వ్యత్యాసం కొన్ని వేల యూనిట్లు మాత్రమే. ఏదో ఒక సమయంలో ఎవరైనా నంబర్‌ వన్‌ అవుతారు. కొన్నిసార్లు మరొకరు నంబర్‌ టూ అవుతారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మా వద్ద ఉన్న నాలుగు ఎస్‌యూవీల్లో మేము అద్భుత పనితీరును కనబరుస్తున్నాము’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు