ఆ కార్లపై 7లక్షల వరకు ధర తగ్గింపు

25 May, 2017 17:10 IST|Sakshi
ఆ కార్లపై 7లక్షల వరకు ధర తగ్గింపు
న్యూఢిల్లీ : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన మెడిన్ ఇండియా వాహనాలపై భారీగా రేట్లు తగ్గించింది. తమ మోడల్ కార్లపై 7 లక్షల రూపాయల వరకు రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుండటంతో కొత్త పన్ను రేటు ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి మెర్సిడెస్ బెంజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ కొత్త ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. ఒకవేళ జీఎస్టీ అమలును వాయిదా వేస్తే, కంపెనీ మళ్లీ పాత ధరలనే కొనసాగించనుంది. మెర్సిడెస్ బెంజ్ స్థానికంగా తొమ్మిది మోడల్స్ ను తయారుచేస్తోంది. అవి సీఎల్ఏ సెడాన్, ఎస్యూవీస్ జీఎల్ఏ, జీఎల్సీ, జీఎల్ఈ, జీఎల్ఎస్, లగ్జరీ సెడాన్లు సీ-క్లాస్, ఈ-క్లాస్, ఎస్-క్లాస్, మేబ్యాచ్ ఎస్ 500.  ఈ మోడల్స్ ధరలు ఎక్స్ షోరూం ఢిల్లీలో 32 లక్షల రూపాయల నుంచి 1.87 కోట్ల మధ్యలో ఉన్నాయి. 
 
సీఎల్ఏ సెడాన్ పై 1.4 లక్షల రూపాయల నుంచి మేబ్యాచ్ ఎస్ 500 మోడల్ ధర 7 లక్షల రూపాయల వరకు ధరను కంపెనీ తగ్గించింది. జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుండటంతో, ఈ తగ్గింపు చేపట్టడం సహేతుకమని మెర్సిడెస్ బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రోల్యాండ్ ఫోల్గర్ చెప్పారు. ఇండియాలో ఉత్పత్తి అయ్యే అన్ని మోడల్స్ పై కస్టమర్లకు ట్రాన్సక్షన్ ధరలను సగటున 4 శాతం వరకు తగ్గించనున్నట్టు ఫోల్గర్ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో ధరల తగ్గింపు 2 శాతం నుంచి 9 శాతం వరకు ఉంటుందని, ప్రస్తుత పన్నుల విధానం, రాష్ట్రాల్లో లోకల్ బాడీ పన్నులపై ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు. 
మరిన్ని వార్తలు