మైక్రోమ్యాక్స్ కొత్త కాన్వాస్

9 Jul, 2013 03:50 IST|Sakshi
Micromax Canvas 4

న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ కంపెనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్, కాన్వాస్ 4ను సోమవారం ఆవిష్కరించింది. ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ధరను రూ.17,999గా నిర్ణయించామని, ఈ వారాంతం నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ చెప్పారు. ఇప్పటికే 11,500 ఫోన్లకు ముందస్తు ఆర్డర్లు లభించాయని, కాన్వాస్ ఫోన్ల హవాను ఈ ఆర్డర్లు వెల్లడిస్తున్నాయని వివరించారు.

ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5 అంగుళాల(12.7 సెం.మీ.) స్క్రీన్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 1.2 గిగా హెర్ట్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, స్మార్ట్ పాజ్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. కాన్వాస్ 4 మొబైల్ ఫోన్ కోసం వినూత్నమైన విక్రయానంతర సర్వీసునందిస్తున్నామని శర్మ తెలిపారు. ఫోన్‌ను రిపేర్‌కు ఇచ్చిన ఏడు రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని, ఒకవేళ అలా చేయని పక్షంలో కొత్త ఫోన్‌ను ఇస్తామని వివరించారు. కాన్వాస్ సిరీస్‌లో రూ.6,000 నుంచి రూ.18,000 రేంజ్‌లో మొత్తం 10 మొబైల్ ఫోన్లున్నాయని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు