హోటళ్లలో బుల్లిష్‌ ధోరణి 

25 Nov, 2023 09:05 IST|Sakshi

ముంబై: దేశ ఆర్థిక పురోగతి, భవిష్యత్‌ అవకాశాల పట్ల దేశీ హోటల్‌ యజమాన్యాల్లో ఎంతో ఆశావాదం నెలకొన్నట్టు బుకింగ్‌ డాట్‌ కామ్‌ సంస్థ వెల్లడించింది. గడిచిన ఆరు నెలల్లో హోటళ్లలో బుకింగ్‌ రేటు పెరిగినట్టు తెలిపింది. రూమ్‌ ధరలు పెరిగినట్టు 49 శాతం మంది చెప్పగా.. గత ఆరు నెలల కాలంలో తమ హోటళ్లో గదుల భర్తీ రేటు పెరిగినట్టు 55 శాతం మంది హౌసింగ్‌ డాట్‌ కామ్‌ సర్వేలో తెలిపారు.

అంతర్జాతీయ ప్రయాణికుల్లో పెరుగుదల ఇందుకు అనుకూలించినట్టు బుకింగ్‌ డాట్‌ కామ్‌ తన సర్వే నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జూలై 17 నుంచి ఆగస్ట్‌ 25 మధ్య టెలిఫోన్‌ ఇంటర్వ్యూల ద్వారా ఈ సర్వే జరిగింది. దేశ ఆతిథ్య పరిశ్రమకు చెందిన 250 మంది ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులు వృద్ధికి ఊతమిస్తున్నారు.

అంతర్జాతీయ ప్రయాణికులను ఆకర్షించడం 2024లో వ్యాపార వృద్ధి అవకాశాలకు కీలకమని 88శాతం మంది భావిస్తున్నారు. తమ వ్యాపార వృద్ధికి కుటుంబాలను ఆకర్షించడం (78 శాతం మంది), మరింత మంది దేశీ ప్రయాణికులను రాబట్టడం (72 శాతం మంది), ఆధ్యాత్మిక పర్యాటకం ఇతర అవకాశాలుగా 64 శాతం మంది చెప్పారు. లాభాల వృద్ధికి ఆహారం పానీయాలు కీలకమని 39 శాతం మంది పేర్కొన్నారు. తమ హోటల్‌ మెనూలో వెగాన్, వెజిటేరియన్‌ ఆహారాన్ని చేర్చడం ముఖ్యమని 41 శాతం మంది 
పేర్కొన్నారు.  

సవాళ్లు.. 
నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడం దేశ హోటల్‌ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సవాళ్లలో ప్రధానంగా ఉంది. ఇంధన వ్యయాలు, పన్నులు రెండు ప్రధాన సవాళ్లు అని 74 శాతం మంది, 73 శాతం మంది చొప్పున చెప్పారు. ఆ తర్వాత సిబ్బంది వేతనాలు, ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడుల వ్యయాలను ఇతర సవాళ్లుగా పేర్కొన్నారు. ఇంధనాన్ని ఆదా చేయడం ప్రాముఖ్యమని 46 శాతం మంది తెలిపారు. వ్యర్థాలను తగ్గించుకోవాలని 45 శాతం మంది, నీటిని ఆదా చేసుకోవాలని 26 శాతం 
మంది అభిప్రాయపడ్డారు.    

మరిన్ని వార్తలు