మైండ్ ట్రీ 1:1 బోనస్ షేర్లు

19 Jan, 2016 01:46 IST|Sakshi
మైండ్ ట్రీ 1:1 బోనస్ షేర్లు

న్యూఢిల్లీ : అన్ని సెగ్మెంట్లలో పటిష్టమైన వృద్ధి కారణంగా మధ్య తరహా ఐటీ సంస్థ మైండ్‌ట్రీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.151 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో ఆర్జించిన నికర లాభం(రూ.141 కోట్లు)తో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. ఆదాయం రూ.912 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ.1,215 కోట్లకు పెరిగిందని వివరించింది. ఈ క్యూ3లో మంచి ఆదాయ వృద్ధిని సాధించామని కంపెనీ సీఈఓ కృష్ణకుమార్ నటరాజన్ తెలిపారు.

డాలర్ టర్మ్‌ల్లో నికర లాభం 0.2 శాతం వృద్ధితో 2.28 కోట్ల డాలర్లకు, ఆదాయం 25 శాతం వృద్ధితో 18.44 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వనున్నామని నటరాజన్ తెలిపారు.  రెండేళ్లలో బోనస్ షేర్లనివ్వడం ఇది రెండోసారని పేర్కొన్నారు.  రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.4 మధ్యంతర డివిడెండ్‌ను కూడా ఇవ్వనున్నామని వివరించారు.  మ్యాగ్నెట్ 360 సంస్థను 5 కోట్ల డాలర్లకు (రూ.338.3 కోట్లు)అంతా నగదులోనే కొనుగోలు చేశామని నటరాజన్ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు