మన సిటీ... మన ఓటు | Sakshi
Sakshi News home page

మన సిటీ... మన ఓటు

Published Tue, Jan 19 2016 1:44 AM

మన సిటీ... మన ఓటు

బల్దియా ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో చైతన్యం నింపేందుకు హైటెక్ ప్రచారానికి తెరలేచింది. ‘ఓటు హక్కు’ అనే పాశుపతాస్త్రం వినియోగించుకొని మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దాలని...డివిజన్లలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన స్థానిక సమస్యలను పరిష్కరించుకోవాలని ఓ సంస్థ పిలుపునిస్తోంది. ఓటర్లలో చైతన్యం నింపేందుకు ‘ఆవాజ్ దో హైదరాబాద్’ పేరిట వినూత్న ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. సోషల్ మీడియా వేదికగా...ప్రామాణ్య స్ట్రాటజీ అనే రాజకీయ పరిశోధన సంస్థ ఈ కార్యక్రమాన్ని నగరంలో ప్రారంభిస్తోంది.
 - సాక్షి, సిటీబ్యూరో

 
* ఓటరు చైతన్యానికి హైటెక్ ప్రచారం
* సోషల్ మీడియా వేదికగా ఓ సంస్థ ప్రయత్నం
* ‘ఆవాజ్ దో హైదరాబాద్’ అంటూ ప్రజలకు పిలుపు
* ప్రజలు, రాజకీయ నేతల మధ్య సమన్వయంతో ముందుకు...

 
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం, రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించడమే లక్ష్యంగా ప్రామాణ్య స్ట్రాటజీ సంస్థ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. పక్షం రోజుల పాటు జరిగే ఈ హైటెక్ ప్రచారంలో ‘మన గళం..మన ఓటు’ నినాదంతో సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి దూసుకెళుతోంది . ఇప్పటికే మన దేశంతోపాటు అమెరికాలోనూ ఈ సంస్థ పనిచేస్తోంది. బల్దియా ఎన్నికల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంస్థ నిర్వాహకులు ‘సాక్షి’కి తెలిపారు.
 
ఈ తరహా ప్రచారం ఎందుకంటే..
సాధారణంగా సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో సిటీజన్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో పోలింగ్ శాతం 50 శాతానికి మించడం లేదు. అసలు నగరవాసులు పోలింగ్‌కు దూరంగా ఉండడానికి కారణాలను ఈ సంస్థ అన్వేషించింది.
 
సిటీజన్ల విముఖతకు కారణమేంటంటే..

* మహానగరపాలక సంస్థ తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతుండడం. పరిపాలన చక్రంలో ఇది అట్టడుగున ఉండడం. సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు, అధికారాలు ఈ సంస్థకు లేదన్న భావన ఉండడం.
* రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో దైనందిన జీవితంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలకు నిర్దిష్ట పరిష్కారాలు చూపకపోవడం. అంటే తమకు సమస్య ఒకటుంటే వారు అరచేతిలో వైకుంఠం చూపేలా మేనిఫెస్టో రూపొందిస్తున్నారని భావిస్తుండడం.
* ఈ ఎన్నికల్లో ఓటు వేసినంత మాత్రాన తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం లేకపోవడం. సమస్య పరిష్కారంలో తమను భాగస్వాములను చేయకపోవడం, తమ వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకునే వారు ఎవరూ లేకపోవడం.
 
ఉద్దేశమిదే..
* ఓటుహక్కు వినియోగించుకునే దిశగా నగర ఓటర్లలో చైతన్యం నింపడం.
* బల్దియా ఎన్నికల్లో స్థానిక సమస్యల పరిష్కారానికి పార్టీలు ముందుకొచ్చేలా చేయడం.
* సోషల్ మీడియా, టెలీ కాలర్స్ ద్వారా ఓటర్లలో అవగాహనకల్పించడం. నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఓటు హక్కు ద్వారా ఎలా పరిష్కరించుకోవాలో అవగాహన కల్పించడం.
* ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలో పలు టెలీఫోన్ లైన్ల ద్వారా నేరుగా ఓటర్లతో సంభాషించడం. ఇందులో వాయిస్ మెయిల్, ఎస్‌ఎంఎస్, మిస్డ్‌కాల్, వాట్సప్ మాధ్యమాల ద్వారా ఓటర్లకు చేరువై..వారితో సంభాషించి వారిని చైతన్య పరచడం.
* సోషల్ మీడియా, ఐవీఆర్‌ఎస్ విధానం ద్వారా తమను సంప్రదించిన వారి వద్దకు సంస్థ ప్రతినిధులు నేరుగా వెళ్లి మాట్లాడడం. స్థానిక సమస్యలు తెలుసుకోవడం, వాటికి పరిష్కారాలను సూచించడం.
* ప్రామాణ్య స్ట్రాటజీ సంస్థ తరఫున 10 మంది సోషల్‌మీడియాలో మరో 15 మంది ఫోన్‌ల ద్వారా జరిగే ప్రచారంలో పాల్గొంటారు.
* స్థానిక సమస్యలపై ఎలక్షన్ ఎజెండాను రూపొందించి వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం.
* స్థానిక సమస్యలను వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థుల దృష్టికి తీసుకెళ్లడం,వారి ప్రతిస్పందన తీసుకోవడం.
* ప్రజలేం కోరుకుంటున్నారో తెలుసుకొని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఈ అంశాలకు చోటు దక్కేలా చూడడం.
 
సంస్థ గురించి...
ప్రామాణ్య స్ట్రాటజీ అనే సంస్థ గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటు, తెలంగాణలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం నింపింది. ‘ప్రజల సమస్యలను తెలుసుకున్నా. అలాగే జనం నాడి తెలుసుకునే అంశాల్లో వివిధ రాజకీయ పార్టీలకు అవసరమైన సర్వేలు, పరిశోధనలు కూడా చేపట్టాం’ అని  సంస్థ నిర్వాహకులు హరి కాసుల ‘సాక్షి’కి తెలిపారు.
 ఆవాజ్‌దో ప్రచార పర్వంలో పాలుపంచుకోవాలనుకుంటే..
 
మొబైల్: 84710 55557
(ఈ నెంబరుకు ఫోన్ లేదా వాయిస్ మెసేజ్, ఎస్‌ఎంఎస్, మిస్డ్‌కాల్ ఇవ్వొచ్చు)

 
ట్విట్టర్: @awazdohyd
 
ఫేస్‌బుక్: @awazdohyderabad
 
ఇ-మెయిల్: awazdohyderabad@gmail.com
 
వినూత్న ప్రయత్నం
ఓటర్లలో ఉన్న నెగెటివ్ ఆలోచనలను తొలగించేందుకు ఈ తరహా ప్రచారం అవసరం. వినూత్న ప్రచారంతో సిటీజన్ల ఆలోచనల్లో మార్పు వస్తుందనుకుంటున్నా. మాజీ కార్పొరేటర్ల పనితీరుపై నెట్ సర్వే ఆకర్షిస్తోంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలి.
- గీతాంజలి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని
 
ఓటు వేస్తేనే అభివృద్ధి
ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా మన చుట్టూ ఉన్న సమాజం అభివృద్ధి చెందుతుందని గుర్తించాలి. వినూత్న ప్రచారంతోనైనా ఓటర్లలో మార్పు రావాలి. రాజకీయాల విషయంలో యువత నిర్లక్ష్యం వీడి ముందుకు రావాలి. మంచి పాలకులను ఎన్నుకునేలా చూడాలి.
- అనూజ్, ఐటీ ఉద్యోగి

Advertisement
Advertisement