షాకింగ్‌ : కూలనున్న ఐదు లక్షల కొలువులు..

19 Nov, 2019 18:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నిర్మాణ రంగం కుదేలైన క్రమంలో రానున్న రెండేళ్లలో రియల్‌ఎస్టేట్‌ ఇతర అనుబంధ రంగాల్లో భారీగా కొలువుల కోత ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిర్మాణ రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించే స్థితిలో ఆయా కంపెనీలు లేవని, తీవ్ర నగదు కొరత బ్యాంకింగ్‌, నిర్మాణ రంగాలకు సమస్యగా పరిణమిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాంకులు నిర్మాణ రంగానికి తాజా రుణాలను నిలిపివేసే పరిస్థితి నెలకొనడం రియల్‌ఎస్టేట్‌ రంగంలో సమస్యలు పెరిగేందుకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు నిర్మాణం పూర్తయిన గృహాలు, వెంచర్లలో పలు యూనిట్లు విక్రయానికి నోచుకోకుండా ఉన్నాయని, భారీగా డిస్కౌంట్లను ఆఫర్‌ చేసినా ఇన్వెంటరీలు పేరుకుపోయాయని నిర్మాణ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

దేశవ్యాప్తంగా రూ 1.8 లక్షల కోట్ల విలువైన నిర్మాణ రంగ ప్రాజెక్టులు నిలిచిపోయాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ వెల్లడించింది. నిర్మాణ రంగంలో స్ధబ్ధత కారణంగా దాదాపు ఐదు లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ అంచనా వేసింది. ఇక సిమెంట్‌, స్టీల్‌ వంటి అనుబంధ పరిశ్రమలోనూ పెద్దసంఖ్యలో పరోక్ష ఉద్యోగాలపైనా ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. గృహాలు, అపార్ట్‌మెంట్ల కొనుగోలుకు వినియోగదారులు దూరంగా ఉండటంతో తక్కువ అద్దెలు, పెట్టుబడి పెరుగుదల ప్రతికూలంగా ఉంటుందనే అంచనాతో ఇన్వెస్టర్లు సైతం ఆస్తుల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. అమ్మకాలు తగ్గిపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న డెవలపర్లు వడ్డీ, ఈఎంఐల చెల్లింపులో డిఫాల్ట్‌ అవుతున్నారని పారాడిగ్మ్‌ రియల్టీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పార్థ్‌ మెహతా చెప్పారు.

మరిన్ని వార్తలు