ఏటీఎం పరిమితులపై ఆర్‌బీఐకి కోర్టు నోటీసులు

25 Dec, 2014 01:07 IST|Sakshi
ఏటీఎం పరిమితులపై ఆర్‌బీఐకి కోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: ఏటీఎంలలో ఉచిత లావాదేవీలపై పరిమితుల విషయంలో రిజర్వ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఎస్‌బీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బ్యాంకులు తమ సొంత ఖాతాదారులపై అనవసర పన్నులు మోపుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్ సహా ఆరు మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్ ఉచిత లావాదేవీలను బ్యాంకులు అయిదింటికి పరిమితం చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే స్వాతి అగర్వాల్ అనే అడ్వకేట్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కొన్ని బ్యాంకులు, ఐబీఏ విజ్ఞప్తి మేరకు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఏకపక్షమైనదని, సంస్కరణల స్ఫూర్తికి వ్యతిరేకమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మటుకు దేశాల్లో ఖాతాదారుల సొంత  బ్యాంకు ఏటీఎంలలో జరిపే లావాదేవీల సంఖ్యపై ఎటువంటి పరిమితులు లేవని వివరించారు. దీంతో హైకోర్టు తాజా నోటీసులు ఇచ్చింది. ‘సొంత ఖాతాదారులపై అనవసర భారం ఎందుకు మోపుతున్నారు? తదుపరి విచారణ తేదీలోగా మీ వివరణ ఇవ్వండి’ అంటూ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.

>
మరిన్ని వార్తలు