ఇక వడ్డీరేట్ల నిర్ణయం ప్రభుత్వానిదే!!

28 Jun, 2016 00:53 IST|Sakshi
ఇక వడ్డీరేట్ల నిర్ణయం ప్రభుత్వానిదే!!

ఆరుగురు సభ్యులతో మానిటరీ పాలసీ కమిటీకి ఓకే
ముగ్గురు ఆర్‌బీఐ నుంచి; ముగ్గురు ప్రభుత్వం నుంచి
ఆర్‌బీఐ చట్టంలో కొత్త నిబంధనల నోటిఫై
ఆగస్టు 9న సమీక్ష నుంచే కమిటీ పని షురూ..!
ఆర్‌బీఐ గవర్నర్ అధికారాలకు కత్తెర...

న్యూఢిల్లీ: దేశంలో వడ్డీ రేట్లు ఏ మేరకు ఉండాలన్నది ఇకపై రిజర్వు బ్యాంకు పరిధిలో ఉండదు. ఇప్పటిదాకా ఆర్‌బీఐ గవర్నరు తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని... ఇకపై నేరుగా ప్రభుత్వమే తీసుకోనుంది. కీలకమైన పాలసీ వడ్డీరేట్ల నిర్ణయంపై ఆర్‌బీఐ గవర్నర్‌కు ఉన్న విశేష అధికారాలకు కేంద్రం ముగింపు పలుకుతోంది. బ్యాంకు రేట్లను నిర్ణయించేందుకు వీలుగా ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఎంపీసీ ఏర్పాటుకు సంబంధించి ఆర్‌బీఐ చట్టంలో సవరణ ద్వారా తీసుకొచ్చిన కొత్త నిబంధనలను సోమవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. దీనిప్రకారం ఎంపీసీకి ఇక చట్టబద్ధత ఉంటుంది.

వచ్చే నెల 9న జరగనున్న తదుపరి పాలసీ సమీక్ష నుంచే వడ్డీరేట్ల నిర్ణయం ఎంపీసీ చేతికి వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుత విధానం ప్రకారం ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి ఆర్‌బీఐ నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా వడ్డీరేట్లపై నిర్ణయం జరుగుతోంది. అయితే, ఈ కమిటీ నిర్ణయాన్ని ఆమోదించడం లేదా తోసిపుచ్చే (వీటో) అధికారం ఇప్పుడు ఆర్‌బీఐ గవర్నర్‌కే ఉంది. అంటే తుది నిర్ణయం ఆర్‌బీఐ గవర్నర్‌కే ఉన్నట్లు లెక్క. ఎంపీసీ ఏర్పాటుతో గవర్నర్‌కు ఉన్న ఈ అధికారానికి బ్రేక్ పడుతుంది. అయితే, ఆరుగురు సభ్యుల నిర్ణయం టై (ముగ్గురు ఒకవైపు మిగతా ముగ్గురు మరోవైపు) అయితే, ఆర్‌బీఐ గవర్నర్ నిర్ణయాత్మక ఓటును వినియోగించుకోవడానికి ఈ కొత్త విధానం వీలుకల్పిస్తోంది.

 సభ్యుల నియామకం వచ్చే నెలలో...
ఎంపీసీలో సభ్యుల నియామకం వచ్చే నెలలో పూర్తవుతుందని.. కమిటీ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంటే ఆగస్టు 9న పాలసీ సమీక్షను ఈ కొత్త కమిటీయే చేపడుతుంది. అంతేకాదు ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు ఇదే ఆఖరి సమీక్ష కూడా కానుంది. సెప్టెంబర్ 4తో ఆయన మూడేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. రెండో విడత కొనసాగే విషయంలో తీవ్ర దుమారం చెలరేగడంతో తాను రెండో చాన్స్ కోరబోనని రాజన్ తాజాగా తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

 ముగ్గురు ఆర్‌బీఐ నుంచి...
ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు ఆర్‌బీఐ నుంచే ఉంటారు. కమిటీకి ఎక్స్-అఫీషియో చైర్‌పర్సన్‌గా ఆర్‌బీఐ గవర్నర్ వ్యవహరిస్తారు. ఒక డిప్యూటీ గవర్నర్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌కు కమిటీలో చోటు ఉంటుంది. మిగతా ముగ్గురిని కేంద్రం నియమిస్తుంది. కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని అన్వేషణ-ఎంపిక కమిటీ వీరి పేర్లను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత లక్ష్యానికి తీసుకురావడం ఎంపీసీ ప్రధాన విధి. ఎంపీసీకి చట్టబద్ధమైన సంస్థాగతమైన కార్యాచరణను కల్పించేందుకు వీలుగా ఆర్‌బీఐ చట్టం-1934లో ఫైనాన్స్ చట్టం-2016 ద్వారా కొన్ని సవరణలు చేశారు. ఎంపీసీలో సభ్యుల నియామకం ప్రక్రియ నిబంధనలను నోటిఫై చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.

ఇతర ముఖ్యాంశాలివీ...
ప్రభుత్వం నియమించే ముగ్గురు సభ్యులకు నాలుగేళ్ల పదవీకాలం ఉంటుంది. పునర్నియామకానికి వీలుండదు.
ఆర్థిక, బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలకు చెందిన నిపుణులకు కమిటీలో చోటిస్తారు.
ఏడాదిలో కనీసం నాలుగుసార్లు కమిటీ సమావేశాలను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి భేటీ తర్వాత నిర్ణయాలను ప్రకటించాలి.
ప్రతి సభ్యుడికి సమీక్ష నిర్ణయాల్లో ఒక ఓటు ఉంటుంది. టై అయితే గవర్నర్ తన నిర్ణయాత్మక ఓటును ఉపయోగిస్తారు.
ద్రవ్యోల్బణానికి కారణాలు, వచ్చే 6-18 నెలల్లో అంచనాలను వివరిస్తూ.. ప్రతి ఆరు నెలలకూ మానిటరీ పాలసీ నివేదికను ఆర్‌బీఐ విడుదల చేస్తుంది.
నిర్దేశిత ద్రవ్యోల్బణం లక్ష్యాలను అందుకోవడంలో విఫలమైతే, అందుకు కారణాలను కూడా ఈ నివేదికలో చెప్పాల్సి ఉంటుంది. ధరల అదుపునకు తీసుకోబోయే చర్యలు, ఎప్పటికల్లా ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని సాధించేదీ కూడా వివరించాలి.

మరిన్ని వార్తలు