ఈ-కామర్స్‌లో నిర్మల్ బొమ్మలు

7 Nov, 2014 00:35 IST|Sakshi
ఈ-కామర్స్‌లో నిర్మల్ బొమ్మలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, యాక్సెసరీస్ వంటివి చూశాం. ఇక నుంచి నిర్మల్ బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, పెంబర్తి పాత్రలు ఇ-కామర్స్ సైట్లలో హల్‌చల్ చేయనున్నాయి. ఆన్‌లైన్‌లో విక్రయానికి ఈ కంపెనీలతో మాట్లాడుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం తెలిపారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు పరిమితమైన వైవిధ్య హస్తకళలను మంచి ప్యాకింగ్‌తో ప్రపంచానికి పరిచయం చేయొచ్చని అన్నారు. ఇక్కడి హస్తకళలకు మంచి ఆదరణ ఉందని చెప్పారు. అమెరికాకు చెందిన దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు.

 ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్..
 ఎఫ్‌ఎంసీజీతోపాటు విభిన్న రంగాల్లో ఉన్న ఐటీసీ లిమిటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఆసక్తిగా ఉంది. హైదరాబాద్‌కు సమీపంలోని గజ్వేల్‌లో పార్క్‌ను స్థాపించాల్సిందిగా కంపెనీకి సూచించామని తారక రామారావు పేర్కొన్నారు. ఐటీసీతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని చెప్పారు. ఐటీసీ గ్రూప్ మాదాపూర్‌లో నెలకొల్పనున్న ప్రతిపాదిత 5 స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. ఐటీసీ కోహినూర్ పేరుతో రానున్న ఈ హోటల్‌కు కంపెనీ రూ.700 కోట్లు వెచ్చిస్తోంది. అలాగే ఐటీసీ రూ.3,000 కోట్లతో భద్రాచలం పేపర్ ప్లాంట్ విస్తరణ ప్రతిపాదనను ప్రభుత్వం స్వీకరించిందని గుర్తు చేశారు.

 హైదరాబాద్ బిర్యానీ..
 ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ బిర్యానీ, హలీమ్ ఎక్కువ రోజులు నిల్వ చేయగలిగే విధానమేదీ లేదని మంత్రి అన్నారు. ఈ విధానం గనక వస్తే యూఎస్‌ఏ వంటి సుదూర దేశాలకు ఎగుమతి చే సేందుకు వీలవుతుందని అన్నారు. ఐఐపీ డెరైక్టర్ ఎన్.సి.సాహా మాట్లాడుతూ హోటళ్లు ముందుకు వస్తే పరిశోధన సాగించేందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు. 20 రోజుల వరకు బిర్యానీ నిల్వ చేయగలిగేలా ప్యాక్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు.

‘గతంలో ప్యాకింగ్ అంటే సులువుగా పట్టుకోగలగడం, తీయగలిగేలా ఉండడం. ఇప్పుడు ఉత్తమ ముడి పదార్థాలు, వినూత్న డిజైన్, భద్రత ప్రాధాన్యతగా మారిపోయాయి’ అని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ కె.సతీష్ రెడ్డి అన్నారు.  సదస్సులో ఐఐపీ చైర్మన్ ఆర్వీఎస్ రామకృష్ణ, హైదరాబాద్ చైర్మన్ ఏవీపీఎస్ చక్రవర్తి తదితరులు మాట్లాడారు.

మరిన్ని వార్తలు