కార్పొరేట్‌ పన్ను కోతకు బిల్లు

26 Nov, 2019 05:59 IST|Sakshi

లోక్‌సభలో బిజినెస్‌

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ట్యాక్సేషన్‌ లాస్‌ (అమెండ్‌మెంట్‌) బిల్లు, 2019ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపునకు ఉద్దేశించిన ఈ బిల్లును అంతక్రితం జారీ చేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో ప్రవేశపెట్టారు. మందగిస్తున్న ఆర్థిక వృద్ధి రేటుకు ఊతం ఇవ్వడానికి కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ, సెప్టెంబర్‌ 20వ తేదీన కేంద్రం ట్యాక్సేషన్‌ లాస్‌ (అమెండ్‌మెంట్‌) ఆర్డినెన్స్, 2019ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.  

ఐఎఫ్‌ఎస్‌సీ అథారిటీ దిశలో...
కాగా, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ) అధారిటీ బిల్లు, 2019ని కూడా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఐఎఫ్‌ఎస్‌సీలకు సంబంధించి ఏకీకృత ఫైనాన్షియల్‌ రెగ్యులేటర్‌ ఏర్పాటు ఈ బిల్లు లక్ష్యం. ఇందుకు సంబంధించి ఏర్పాటయ్యే అథారిటీలో తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. చైర్మన్‌ నేతృత్వంలో పనిచేసే అథారిటీలో ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏఐ, పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. ఇద్దరు ప్రభుత్వ నామినీలు ఉంటారు. సెలెక్ట్‌ కమిటీ సిఫారసులతో మరో ఇరువురినీ ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. అన్ని ఫైనాన్షియల్‌ సేవల ఏకీకృత నియంత్రణ ప్రతిపాదిత అథారిటీ ఏర్పాటు లక్ష్యం. ఐఎఫ్‌ఎస్‌సీల్లో ప్రస్తుతం బ్యాంకింగ్, క్యాపిటల్‌ మార్కెట్స్, బీమా రంగాలు ఉంటే, వాటని ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏఐ వంటి విభిన్న రెగ్యులేటర్లు నియంత్రిస్తున్నాయి.  

సెంట్రల్‌ జీఎస్‌టీ @ రూ.3.26 లక్షల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ వరకూ సెంట్రల్‌ జీఎస్‌టీ వసూళ్లు రూ.3.26 లక్షల కోట్లని ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, బడ్జెట్‌ అంచనాలు రూ.6,63,343 కోట్లలో అక్టోబర్‌ ముగిసే నాటికి దాదాపు సగం వసూళ్లు జరిగాయని వివరించారు. కాగా ప్రత్యక్ష పన్నుల వసూళ్ల బడ్జెట్‌ లక్ష్యం రూ.13,35,000 కోట్లయితే, అక్టోబర్‌ ముగిసే నాటికి నికర వసూళ్లు రూ.5,18,084 కోట్లని వివరించారు.

>
మరిన్ని వార్తలు