బ్రేకులు పడుతూ... ముందుకు!

1 Nov, 2017 23:38 IST|Sakshi

అక్టోబర్‌లో మిశ్రమంగా వాహన విక్రయాలు

మారుతీ అమ్మకాలు 9.9 శాతం జంప్‌

మహీంద్రా, టాటా మోటార్స్‌ స్వల్ప వృద్ధి

ఫోర్డ్, హోండా, హ్యుందాయ్‌ మాత్రం క్షీణత  

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ అయినప్పటికీ దేశీ వాహన విక్రయాలు అక్టోబర్‌లో మిశ్రమంగా నమోదయ్యాయి. జీఎస్‌టీ అమలు తర్వాత ధరలు పెరుగుతాయనే అంచనాలతో కస్టమర్లు ముందుగానే వాహన కొనుగోళ్లు జరపడం దీనికి కారణం. మారుతీ సుజుకీ, టయోటా కార్ల అమ్మకాల్లో వృద్ధి నమోదయ్యింది. మహీంద్రా, టాటా మోటార్స్‌ వాహన అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. ఇక ఫోర్డ్, హోండా కార్స్, హ్యుందాయ్‌ విక్రయాలు మాత్రం క్షీణించాయి.

►మారుతీ దేశీ వాహన విక్రయాలు 9.9 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,23,764 యూనిట్ల నుంచి 1,36,000 యూనిట్లకు ఎగశాయి.
► ‘పండుగ సీజన్‌ కారణంగా విక్రయాల్లో జోష్‌ కనిపించింది. కస్టమర్‌ డిమాండ్‌ పెరిగింది. ఇన్నోవా క్రిస్టా, ఫార్చునర్‌ అమ్మకాల్లో మంచి వృద్ధి నమోదయ్యింది’ అని టీకేఎం డైరెక్టర్, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) ఎన్‌.రాజా తెలిపారు.
► ‘ధంతేరాస్, దీపావళి వరకు విక్రయాల్లో వృద్ధి కనిపిస్తే.. తర్వాతి నుంచి డిమాండ్‌ క్రమంగా తగ్గింది’ అని మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రెసిడెంట్‌ (ఆటోమోటివ్‌) రాజన్‌ వదేరా తెలిపారు.  
►కొత్త ఆవిష్కరణల్లో జాప్యం విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపిందని ఫోర్డ్‌ ఇండియా ఎండీ అనురాగ్‌ మెహ్రోత్రా తెలిపారు. నవంబర్‌ 9న అప్‌డేటెడ్‌ ఎకోస్పోర్ట్‌ను తీసుకువస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు