టోకు ధరలు ఐదేళ్ల కనిష్ట స్థాయికి

15 Nov, 2014 01:02 IST|Sakshi
టోకు ధరలు ఐదేళ్ల కనిష్ట స్థాయికి

న్యూఢిల్లీ: టోకు ధరలు 2014 అక్టోబర్‌లో ఐదేళ్ల కనిష్ట స్థాయిని నమోదుచేసుకున్నాయి. ఈ నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు కేవలం 1.77 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 అక్టోబర్‌తో పోల్చితే 2014 అక్టోబర్ నెలలో టోకు ధరలు కేవలం 1.77 శాతం మాత్రమే పెరిగాయన్నమాట. వార్షికంగా నిర్దిష్ట నెలను పరిగణనలోకి తీసుకుంటే... ఈ స్థాయిలో మాత్రమే టోకు ధరల పెరుగుదల రేటు నమోదుకావడం ఐదేళ్లలో ఇదే తొలిసారి.

గత ఏడాది ఇదే నెలలో(అక్టోబర్) టోకు ధరల స్పీడ్ 7.24 శాతంగా ఉంది.  2014 సెప్టెంబర్‌లో రేటు 2.38 శాతం.  ఇంత తక్కువ స్థాయిలో టోకు ధరల స్పీడ్ నమోదుకు ఒకపక్క ఇంధన ధరలు, మరోపక్క ఆహార ఉత్పత్తుల ధరల తగ్గుదల కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధిక బేస్ రేటు  ప్రభావం కూడా ఉందని పేర్కొన్నాయి. ఈ సూచీ వరుసగా ఐదు నెలల నుంచీ తగ్గుతూ వస్తోంది. శుక్రవారం ఈ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

 కార్పొరేట్ల ఆశలు...
 ధరలు ఈ స్థాయికి తగ్గడంతో ఇక వడ్డీరేట్ల కోత ద్వారా ఆర్‌బీఐ వృద్ధికి ఊతం ఇవ్వాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. డిసెంబర్ 2వ తేదీ  న జరగనున్న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షపై ఆయా వర్గాలు ఆశలు పెట్టుకుంటున్నాయి. అయితే, క్రూడ్ ధరకు సంబంధించి భవిష్యత్ అనిశ్చితి, ద్రవ్యోల్బణం తగ్గుదల అంతిమంగా వినియోగదారుకు అందుబాటులోకి తీసుకురావడం వంటి కారణాల ప్రాతిపదికన రానున్న రెండు పాలసీ సమీక్షా కాలాల్లో సైతం ఆర్‌బీఐ వడ్డీరేటు తగ్గించక పోవచ్చునని ఐసీఆర్‌ఏ సీనియర్ ఎకనమిస్ట్ ఆదితి నాయర్ విశ్లేషించారు.

 ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే...
 ఆహార ఉత్పత్తుల ధరలు టోకున వార్షికంగా అక్టోబర్ నెలలో 2.7 శాతం మాత్రమే పెరిగాయి. సెప్టెంబర్‌తో పోల్చితే ఈ రేటు 0.82 శాతం (3.52 శాతం నుంచి ) తగ్గింది. వార్షికంగా చూస్తే (నిర్దిష్టంగా అక్టోబర్ నెలలో) ఉల్లిపాయలు (-59.77 శాతం), కూరగాయలు (-19.61 శాతం), ప్రొటీన్ ఆధారిత నాన్ వెజ్- గుడ్లు, మాంసం, చేపలు (-2.58 శాతం), గోధుమలు (-1.92 శాతం) ధరలు అసలు పెరక్కపోగా తగ్గాయి. ఇక పెరిగిన ఆహార ఉత్పత్తుల్లో బంగాళా దుంపలు (82.11 శాతం), పళ్లు (19.35 శాతం), పాలు (11.39 శాతం), బియ్యం (6.47 శాతం), పప్పు దినుసులు (4.02%), తృణధాన్యాలు (3.29%) ఉన్నాయి.

 మరింత తగ్గుతుంది: జైట్లీ
 అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినందున, ధరల పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. అయితే క్రూడ్ ధరల భవిష్యత్ పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయంలో కొంత జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అంశంపై అధిక ఆశావహంతో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు