ఎస్‌బీఐ లాభం జూమ్ | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ లాభం జూమ్

Published Sat, Nov 15 2014 3:02 AM

ఎస్‌బీఐ లాభం జూమ్

న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మెరుగైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో బ్యాంక్ స్టాండెలోన్ ప్రాతిపదికన రూ.3,100 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.  క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,375 కోట్లతో పోలిస్తే 30.5 శాతం వృద్ధి నమోదైంది. ప్రధానంగా వడ్డీ ఆదాయాలు పుంజుకోవడం, పటిష్టమైన వ్యయ నియంత్రణ చర్యలు ఇందుకు దోహదం చేసినట్లు బ్యాంకు తెలిపింది. ఇక మొత్తం ఆదాయం కూడా 12.5 శాతం పెరిగి రూ.41,833 కోట్లకు ఎగబాకింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.37,200 కోట్లుగా ఉంది.

 మొండిబకాయిలు తగ్గాయ్...
 ఈ ఏప్రిల్-సెప్టెంబర్ క్వార్టర్‌లో బ్యాంకు మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏ) 4.89 శాతానికి దిగొచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల ఎన్‌పీఏలు 5.64 శాతం కావడం గమానార్హం. ఈ ఏడాది క్యూ1లో స్థూల ఎన్‌ఈపీఏలు 4.9 శాతంగా ఉన్నాయి. కాగా, క్యూ2లో నికర ఎన్‌పీఏలు కూడా 2.73 శాతానికి(గతేడాది క్యూ2లో 2.91 శాతం) తగ్గుముఖం పట్టాయి.

బ్యాంకు మొత్తం ప్రొవిజనింగ్ క్యూ2లో 35 శాతం ఎగబాకి రూ.5,322 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3,937 కోట్లుగా ఉంది. కాగా, రుణాలపై ప్రొవిజనింగ్ రూ.2,645 కోట్ల నుంచి రూ.4,028 కోట్లకు ఎగసింది.  కాగా, ఈ క్యూ2లో కొత్తగా మొండిబకాయిలుగా మారిన రుణాల మొత్తం రూ.7,700 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే వ్యవధి ఈ మొత్తం రూ.8,365 కోట్లు కావడం గమనార్హం.

మొండిబకాయిల రికవరీ విషయానికొస్తే.. గతేడాది క్యూ2లో రూ.1,414 కోట్లు కాగా, ఈ క్యూ2లో రూ.965 కోట్లకు పరిమితమైంది. రూ.1,640 కోట్ల విలువైన రుణాలను అప్‌గ్రేడ్ (ఎన్‌పీఏల నుంచి సాధారణ రుణాలుగా) చేయగా... రూ.4,787 కోట్ల విలువైన రుణాలను మాఫీ చేసింది. మరోపక్క, క్యూ2లో రూ.4,371 కోట్ల రుణాలను పునర్‌వ్యవస్థీకరించింది. మరో రూ.3,000 కోట్ల రుణాలు ఈ బాటలో ఉన్నాయి. అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలకు రూ.406 కోట్ల విలువైన రుణాలను విక్రయించింది.

 ఇతర ముఖ్యాంశాలివీ...
 అనుబంధ సంస్థలన్నింటితో కలిపి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎస్‌బీఐ నికర లాభం కూడా 31% ఎగసి రూ.4,024 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.3,073 కోట్లుగా నమోదైంది.
 బ్యాంకు నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) క్యూ2లో 8.36 శాతం పెరిగి రూ.13,275 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.12,251 కోట్లు.
 ఇక నిర్వహణ వ్యయాలు చాలా తక్కువస్థాయిలో 2.23 శాతమే పెరిగాయి. సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.9,218 కోట్ల నుంచి రూ.9,423 కోట్లకు చేరింది.
 నికర వడ్డీ మార్జిన్ కూడా 3.48% నుంచి 3.49 శాతానికి పెరిగింది.
సెప్టెంబర్ చివరినాటికి బ్యాంకు డిపాజిట్ల మొత్తం 14 శాతం వృద్ధితో రూ.14,73,785 కోట్లకు చేరింది. రుణాల విలువ 9 శాతం పెరిగి రూ.12,42,638 కోట్లుగా నమోదైంది.
 ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు ధర శుక్రవారం బీఎస్‌ఈలో 2.55 శాతం ఎగబాకి రూ.2,788 వద్ద ముగిసింది. ఒకానొక దశలో రూ.2,806 గరిష్టాన్ని కూడా తాకింది. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ సమయంలోనే బ్యాంక్ ఫలితాలను ప్రకటించింది. కాగా, శుక్రవారం ఒక్కరోజే బ్యాంకు మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ. 5,174 కోట్లకుపైగా ఎగబాకింది. రూ.2,08,178 కోట్లకు చేరింది.

 ఎన్‌పీఏలు క్రమంగా దారికి...
 నిర్వహణ వ్యయాలను సాధ్యమైనంతమేర నియంత్రించడం, మెరుగైన వడ్డీ ఆదాయాలు క్యూ2లో లాభాలు పుంజుకోవడానికి తోడ్పడ్డాయి. అన్ని రంగాల్లోనూ మొండిబకాయిలు(ఎన్‌పీఏ) నమోదవుతున్నాయి. వ్యవసాయ రంగంలో మొండిబకాయిల భారీ పెరుగుదల ప్రభావం నుంచి ఇంకా కుదుటపడలేదు. అయితే, తెలంగాణలో ప్రభుత్వం నుంచి రైతుల రుణ మాఫీకి సంబంధించిన ఒక వాయిదా మొత్తం ఇప్పటికే అందింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచీ త్వరలోనే కొంత మొత్తం లభిస్తుందని ఆశిస్తున్నాం.

ఈ నేపథ్యంలో రానున్న కాలంలో వ్యవసాయ రంగ మొండిబకాయిలు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నాం. మొండిబకాయిల సమస్య చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మెరుగుదల క్రమంగానే ఉంటుంది. డిమాండ్ పుంజుకుంటే మొండిబకాయిలు వేగంగా తగ్గుముఖం పట్టొచ్చు. ఇందుకు ఏడాది వ్యవధి పట్టొచ్చని అంచనా. క్యూ2లో రుణాల వృద్ధి అంతంతమాత్రంగానే ఉంది.

ప్రస్తుత పూర్తి ఏడాదికి రుణాల్లో 11-12 శాతం, డిపాజిట్లలో 14 శాతం వృద్ధి ఉండొచ్చు. ఇక అనుబంధ బ్యాంకుల విలీనంపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించే పనిలో ఉన్నాం. ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా ఆసక్తితో ఉంది. త్వరలోనే మా అభిప్రాయాలను తెలియజేస్తాం. బ్యాంకు వ్యయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నందునే ఏటీఎం లావాదేవీల పరిమితి విధింపు, చార్జీల సవరణ నిర్ణయాలను తీసుకున్నాం. - అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చైర్‌పర్సన్

Advertisement
Advertisement