రెండేళ్ల గరిష్ట స్థాయికి టోకు ధరలు

15 Sep, 2016 01:02 IST|Sakshi
రెండేళ్ల గరిష్ట స్థాయికి టోకు ధరలు

ఆగస్టులో 3.74 శాతం
ఆహార ధరలు 8.23 శాతం అప్

 న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ధరల పెరుగుదల రేటు ఆగస్టులో 3.74 శాతంగా నమోదయ్యింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. సూచీలో దాదాపు 60 శాతంపైగా వాటా కలిగిన తయారీ విభాగంలో కొన్ని వస్తువులు, అలాగే పప్పు దినుసుల ధరల పెరుగుదల మొత్తం సూచీపై ప్రభావం చూపింది. అదీకాక గత ఆర్థిక సంవత్సరం ఇదే నెల (ఆగస్టు) ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా క్షీణతలో -5.06% వద్ద ఉండడం(బేస్ ఎఫెక్ట్) కూడా తాజా పెరుగుదలకు కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జూలైలో కూడా టోకు ద్రవ్యోల్బణం 3.55%గా నమోదయ్యింది. 2014 నవంబర్ నుంచి 2016 మార్చి వరకూ క్షీణతలో ఉన్న టోకు ద్రవ్యోల్బణం వరుసగా 7 నెలల నుంచీ ప్లస్‌లోకి మారింది.

 మూడు ప్రధాన విభాగాలను చూస్తే...
- ఆహార, ఆహారేతర ఉత్పత్తులకు సంబంధించిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 7.47 శాతంగా నమోదయ్యింది. 2015 ఆగస్టులో ఈ రేటు - 4.21 శాతంగా ఉంది. ఇక ఇందులో భాగంగా ఉన్న ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం వార్షికంగా -1.02 శాతం క్షీణత నుంచి 8.23 శాతానికి ఎగసింది. నాన్-ఫుడ్ ఆర్టికల్స్ రేటు -0.45 శాతం నుంచి 8.44 శాతానికి చేరింది.  నిత్యావసరాలకు సంబంధించి కూరగాయల ధరలు వార్షికంగా జూలైలో 28.05 శాతం పెరిగితే ఆగస్టులో ఈ రేటు 0.17 శాతంగానే ఉంది. పప్పుల ధర లు మాత్రం భారీగా 34.55 శాతం పెరిగినట్లు తాజా వాణిజ్య మంత్రిత్వశాఖ నివేదిక తెలిపింది. తయారీ రంగం వాటా -1.99% నుంచి 2.42 శాతానికి చేరింది.

మరిన్ని వార్తలు