పడగొట్టిన రూపాయి

20 Jul, 2018 01:46 IST|Sakshi

ఆద్యంతం  హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్‌   22 పాయింట్లు  తగ్గి 36,351కు సెన్సెక్స్‌ 23 పాయింట్ల  నష్టంతో 10,957కు నిఫ్టీ  

దశ, దిశ లేకుండా సాగిన గురువారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌ స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం 40 పైసలకు పైగా నష్టపోవడం, ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఆద్యంతం స్టాక్‌ సూచీలు పరిమిత శ్రేణిలో తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ఆరంభ లాభాలన్నింటినీ కోల్పోయి, అలాగే ఇంట్రాడే నష్టాల నుంచి కూడా ఒకింత రికవరీ అయి స్టాక్‌సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 11,000 పాయింట్ల పైకి ఎగబాకినప్పటికీ, అక్కడ నిలదొక్కుకోలేకపోయింది.  సెన్సెక్స్‌ 22 పాయింట్ల నష్టంతో 36,351 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్లు పతనమై 10,957 వద్ద ముగిశాయి.  లోహ, ఐటీ, ఫార్మా షేర్లు పతనమయ్యాయి. అధిక వేల్యూయేషన్ల కారణంగా స్మాల్, మిడ్‌క్యాప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది.  

236 పాయింట్ల రేంజ్‌లో కదలిన సెన్సెక్స్‌... 
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. కొనుగోళ్ల జోరుతో 142 పాయింట్ల లాభంతో 36,516 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించడం, డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 40 పైసలు వరకూ నష్టపోవడం, పై స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్‌ నష్టాల్లోకి జారిపోయింది. అమ్మకాల జోరుతో 94 పాయింట్ల నష్టంతో 36,279 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మొత్తం మీద రోజంతా    236 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 26 పాయింట్ల వరకూ ఎగియగా, మరో దశలో 45 పాయింట్ల వరకూ నష్టపోయింది.    స్టాక్‌ సూచీలు నష్టాల్లో ముగిసినప్పటికీ, పలు షేర్లు  జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్, యస్‌ బ్యాంక్, ఏషియన్‌ పెయింట్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి.  

మరిన్ని వార్తలు