విధానాలను క్రమబద్ధీకరించాలి

14 Dec, 2018 04:31 IST|Sakshi

అందరికీ సేవలు అందాలి

‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’పై అధికారులకు మోదీ సూచన  

న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా విధానాలను క్రమబద్ధీకరించాలని, అట్టడుగున ఉండేవారికి కూడా సేవలు అందేలా చూడటంపై దృష్టి పెట్టాలని అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ’ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ జాబితాలో దేశ ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవడంతో పాటు చిన్న వ్యాపార సంస్థలు, సామాన్య ప్రజానీకం జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడేందుకు ఇవి ఉపయోగపడగలవని ఆయన చెప్పారు. సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై గురువారం జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో మోదీ ఈ విషయాలు పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం  వెల్లడించింది. నిర్మాణాలకు అనుమతులు, కాంట్రాక్టుల అమలు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, రుణ సదుపాయాలు తదితర అంశాలు  చర్చకు వచ్చినట్లు వివరించింది. వ్యాపార సంస్కరణల అమలు తీరుతెన్నులు, ఎదురవుతున్న అడ్డంకులు, వాటిని పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ప్రధానికి వివరించారు. ప్రపంచ బ్యాంకు ’డూయింగ్‌ బిజినెస్‌’ పేరిట రూపొందించే వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో గడిచిన నాలుగేళ్లలో భారత్‌ 142వ స్థానం నుంచి 77వ స్థానానికి ఎగబాకింది.

మరిన్ని వార్తలు