పొదుపు మొత్తాలపై తగ్గిన వడ్డీ

1 Jul, 2017 00:32 IST|Sakshi
పొదుపు మొత్తాలపై తగ్గిన వడ్డీ

జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి 0.1 శాతం కోత
న్యూఢిల్లీ: పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), కిసాన్‌ వికాస్‌ పత్రాలు, సుకన్య సమృద్ధి తదితర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి గాను వడ్డీ రేట్లను కేంద్రం 0.1 శాతం మేర తగ్గించింది. అయితే, సేవింగ్స్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును యథాతథంగా వార్షికంగా 4 శాతం స్థాయిలోనే ఉంచింది. తాజా పరిణామంతో బ్యాంకులు సైతం డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది ఏప్రిల్‌ నుంచి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం మూడు నెలలకోసారి సవరిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం... ఇకపై పీపీఎఫ్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేసే మొత్తాలపై వార్షిక ప్రాతిపదికన 7.8 శాతం వడ్డీ రేటు ఉంటుంది.

కిసాన్‌ వికాస్‌ పత్రాలపై 7.5 శాతం వడ్డీ రేటు, మెచ్యూరిటీ గడువు 115 నెలలుగా ఉంటుంది.
బాలికల భవిష్యత్‌కు ఉపయోగపడే సుకన్య సమృద్ధి అకౌంట్‌ స్కీముపై ఇప్పటిదాకా 8.4 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా ఇకపై 8.3 శాతం మాత్రమే లభించనుంది.
5 ఏళ్ల సీనియర్‌ సిటిజెన్స్‌ సేవింగ్స్‌ స్కీముపైనా 8.3 శాతం మాత్రమే దక్కుతుంది.

మరిన్ని వార్తలు