వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు ఎత్తివేత

1 Jul, 2017 00:31 IST|Sakshi
కర్నూలు (హాస్పిటల్‌): వస్తు సేవల పన్ను(జీఎస్‌టి) అమలు నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుంచి కర్నూలు నగర శివారులోని పంచలింగాల వద్ద ఉన్న వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టును ఎత్తివేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణా రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను ఈ చెక్‌పోస్టులో తనిఖీ చేసేవారు. రోజుకు 1500 నుంచి 2వేల నుంచి వాహనాలు ఇక్కడకు వచ్చేవి. వీటిలో ఉన్న సరుకు తాలూకు పత్రాలను తనిఖీ చేసి, అవసరమైన మేరకు రుసుము వసూలు చేసేవారు. జీఎస్‌టి అమలు నేపథ్యంలో ఈ చెక్‌పోస్టులను ఎత్తివేశారు. శనివారం సాయంత్రం ఆ శాఖ డిప్యూటీ కమిషనర్‌ తాతారావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి దాకా నిర్వహించిన సేవలను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్‌లో నిర్వర్తించాల్సిన విధుల గురించి చర్చించుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్లు వెంకటేశ్వర్, గీతామాధురి, సీటీవోలు నాగేంద్రప్రసాద్, హుసేన్‌ సాహెబ్, రామాంజనేయప్రసాద్, డీసీటీవోలు, ఏసీటీవోలు పాల్గొన్నారు. 
 
అధికారుల హోదాలు మార్పు
జీఎస్‌టీ అమలు నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ అధికారుల హోదాలు మారాయి. ప్రస్తుతం ఆ శాఖలో డిప్యూటీ కమిషనర్‌ ఇకపై జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్‌గా మారారు. అలాగే అసిస్టెంట్‌ కమిషనర్‌ను డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్, సీటీవోలను అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్, డీసీటీవోలను డిప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్, ఏసీటీవోలను జీఎస్‌టి ఆఫీసర్స్‌గా మార్చారు. 
 
మరిన్ని వార్తలు