యస్‌బ్యాంక్‌కు ‘మొండి’ సెగ

27 Jul, 2018 00:40 IST|Sakshi

31 శాతం పెరిగిన నికర లాభం 

తగ్గిన రుణ నాణ్యత 

4 శాతం పతనమైన షేర్‌  

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ యస్‌బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌లో 31 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.966 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.1,260 కోట్లకు పెరిగిందని యస్‌బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,786 కోట్ల 43 శాతం వృద్ధితో రూ.8,272 కోట్లకు పెరిగిందని యస్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ రాణా కపూర్‌ చెప్పారు. నికర వడ్డీ ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.2,219 కోట్లకు, ఇతర ఆదాయం 50 శాతం వృద్ధితో రూ.1,694 కోట్లకు ఎగిశాయని వెల్లడించారు. నికర వడ్డీ మార్జిన్‌ 3.3 శాతంగా నమోదైందన్నారు. కాగా ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ షేర్‌ 4 శాతం తగ్గి రూ. 370 వద్ద ముగిసింది.  

పెరిగిన మొండి బకాయిలు...: గత క్యూ1లో 0.97 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 1.31 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 0.39 శాతం నుంచి 0.59 శాతానికి ఎగిశాయి. మొండి బకాయిలకు, ఇతరాలకు కేటాయింపులు రూ.286 కోట్ల నుంచి రెట్టింపునకు పైగా పెరిగి రూ.626 కోట్లకు చేరాయి. ఆర్‌బీఐ వెల్లడించిన రెండో మొండి బకాయిల జాబితాలో తమ బ్యాంక్‌కు చెందిన రూ.655 కోట్లకు సంబంధించిన ఏడు ఖాతాలున్నాయని కపూర్‌ వెల్లడించారు. వీటికి గాను రూ.568 కోట్ల కేటాయింపులు జరిపామన్నారు. ‘‘ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 43 శాతంగా ఉంది. రుణాలు 53 శాతం వృద్ధితో రూ.2,14,720 కోట్లకు, డిపాజిట్లు 42 శాతం వృద్ధితో రూ.2,13,394 కోట్లకు పెరిగాయి’’ అనిఎమ్‌డీ, సీఈఓ  తెలియజేశారు.   
 

>
మరిన్ని వార్తలు