Stock Market: జీవితకాల గరిష్టాల వద్ద బేర్‌ పంజా..! | Sakshi
Sakshi News home page

Stock Market: జీవితకాల గరిష్టాల వద్ద బేర్‌ పంజా..!

Published Thu, Dec 21 2023 5:25 AM

Stock Market: Bear attack.. Nifty 50 sees biggest 1-day fall in 9 months - Sakshi

ముంబై: దలాల్‌ స్ట్రీట్‌లో కొత్త శిఖరాలపై దూసుకెళ్తున్న బుల్‌ను ఒక్కసారిగా బేర్‌ ముట్టడించింది. ఫలితంగా ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు గడిచిన 9 నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్‌ 931 పాయింట్లు క్షీణించి 70,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 303 పాయింట్లు నష్టపోయి 21,150 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి.

పలు రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 476 పాయింట్లు లాభపడి 71,913 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 21,593 వద్ద కొత్త జీవికాల గరిష్టాలు నమోదు చేశాయి. దేశీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావాలతో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ట్రేడింగ్‌ ముగిసే అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ తలెత్తడంతో సూచీలు ఒకశాతానికి పైగా పతనమయ్యాయి.  ఒక దశలో సెన్సెక్స్‌ 1,134 పాయింట్లు పతనమై 70,303 వద్ద, నిఫ్టీ 366 పాయింట్లు క్షీణించి 21,087 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ అమ్మకాలు తలెత్తాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ సూచీలు వరుసగా 3.42%, 3.12% చొప్పున నష్టపోయాయి.  

► ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ బుధవారం ఒక్కరోజే రూ.8.91 లక్షల కోట్ల సంపద తగ్గి రూ.350 లక్షల కోట్లకు దిగివచ్చింది.
► సెన్సెక్స్‌ సూచీ 30 షేర్లలో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(0.19%) మినహా మిగిలిన 29 షేర్లూ 4% వరకు నష్టపోయాయి.
► రంగాల వారీగా యుటిలిటీ 4.65%, టెలికం 4.36%, విద్యుత్‌ 4.33%, సరీ్వసెస్‌ 4.20%, మెటల్, కమోడిటీ, పారిశ్రామిక, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలు 3.50% వరకు నష్టపోయాయి.
► ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. యూకోబ్యాంక్‌ 10.50%, ఐఓబీ 10%, సెంట్రల్‌ బ్యాంక్‌ 8%, పీఎస్‌బీ, పీఎస్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 5%  పతనయ్యాయి. ఇండియన్‌ బ్యాంక్, బీఓబీ షేర్లు 4–3% పడ్డాయి.  ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఈ ఏడాదిలో అత్యధికంగా 4% క్రాష్‌ అయ్యింది.  


దుమ్మురేపిన డోమ్స్‌..
డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ లిస్టింగ్‌ హిట్‌ అయ్యింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.790)తో పోలిస్తే 77% ప్రీమియంతో రూ.1,400 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 82% ర్యాలీ చేసి రూ.1,434 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివర్లో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 68% లాభంతో రూ.1,331 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.8,077 కోట్లుగా నమోదైంది. కాగా, ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిస్టింగ్‌ పర్వాలేదనిపించింది. బీఎస్‌ఈ ఇష్యూ ధర (రూ.493)తో పోలిస్తే 12% ప్రీమియంతో రూ.613 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 27% ర్యాలీ చేసి రూ.625 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని వద్ద తాకింది. చివరికి 10% లాభంతో రూ.544 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.5,818 కోట్లుగా నమోదైంది.

ఇవీ నష్టాలకు కారణాలు
లాభాల స్వీకరణ  
విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ప్రోద్బలంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ గత నెల రోజుల్లో  ఏకంగా 7.2% లాభపడింది. పలు రంగాల షేర్లు అధిక వాల్యుయేషన్ల వద్ద ట్రేడవుతున్నాయి. సాంకేతిక చార్టులు ‘అధిక కొనుగోలు’ సంకేతాలను సూచిస్తున్నాయి. వరుస ర్యాలీతో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ అనివార్యమైందని మార్కెట్‌ నిపుణులు తెలిపారు.

మళ్లీ కరోనా భయాలు...
దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 614 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో కోవిడ్‌ 19 సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1కి సంబంధించి 292 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పరిణామాలు ఇన్వెస్టర్లను
ఆందోళనకు గురిచేశాయి.  

ఎర్ర సముద్రం వద్ద ఉద్రిక్తతలు  
ప్రపంచంలో ముఖ్య నౌకా మార్గాల్లో ఒకటైన ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తుండడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అనేక వాణిజ్య సంస్థలు ఆ మార్గం ద్వారా తమ నౌకలు వెళ్లకుండా నిలుపుదల చేశాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు మరింత పెరిగే వీలున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు.   

ప్రాథమిక మార్కెట్లో ఐపీఓ ‘రష్‌’  
గడిచిన నెల రోజుల్లో ప్రధాన విభాగం నుంచి 11 కంపెనీలతో సహా అనేక చిన్న, మధ్య తరహా స్థాయి కంపెనీలు నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఈ పబ్లిక్‌ ఇష్యూల్లో పాల్గొనేందుకు అవసరమైన లిక్విడిటి(ద్రవ్య)ని పొందేందుకు హెచ్‌ఎన్‌ఐలు, రిటైల్‌ ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకు పాల్పడంతో సెకండరీ మార్కెట్‌ ఒత్తిడికి లోనై ఉండొచ్చని స్టాక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement