గణాంకాలు, ఫలితాల ప్రభావం

13 Feb, 2017 00:43 IST|Sakshi
గణాంకాలు, ఫలితాల ప్రభావం

ద్రవ్యోల్బణ గణాంకాలు
చివరి బ్యాచ్‌ క్యూ3 ఫలితాలు
యూపీ ఎన్నికల సరళి
ఈ వారం మార్కెట్‌ ప్రభావిత అంశాలు ఇవే..


న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పోలింగ్‌ సరళి, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు ఈ వారం వెలువడే కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు కూడా మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం, ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల పోకడ. తదితర అంశాలు స్టాక్‌ సూచీల కదలికలపై ప్రభావం చూపుతాయని మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయం.

నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు..
ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, చివరి బ్యాచ్‌ క్యూ3 ఫలితాలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్‌ స్మార్ట్‌ ఆన్‌లైన్‌ డైరెక్టర్‌ విజయ్‌ సింఘానియా చెప్పారు. నేడు(సోమవారం) మార్కెట్‌ ముగిసిన తర్వాత రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు, మంగళవారం టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడుతాయి. ఇక ఈ వారంలో హిందాల్కో, ఎన్‌ఎండీసీ, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, హెచ్‌పీసీఎల్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, డీఎల్‌ఎఫ్, వేదాంత, నాల్కో, పవర్‌ ఫైనాన్స్‌ వంటి కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు వెలువడతాయి.

ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో పోలింగ్‌ సరళిని బట్టి మార్కెట్‌ చలిస్తుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ డైరెక్టర్‌ అబ్నిశ్‌ కుమార్‌ సుధాంశు పేర్కొన్నారు. మొత్తం మీద ఈ వారంలో మార్కెట్‌ పరిమిత శ్రేణిలోనే కదలాడవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు.  సోమవారం నాటి ట్రేడింగ్‌ ప్రారంభంలో గత శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం ఉంటుంది. గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 94 పాయింట్లు లాభపడి 28,334 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 8,794 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.

విదేశీ కొనుగోళ్ల జోరు..
నాలుగు నెలలుగా సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు ఫిబ్రవరిలో అడ్డుకట్ట పడింది. విదేశీ ఇన్వెస్టర్లపై పన్నుల విషయమై స్పష్టత రావడంతో ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌  మార్కెట్లో నికరంగా రూ.5,827 కోట్లు పెట్టుబడులు పెట్టారు.  డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్లో రూ.2,088 కోట్లు, డెట్‌ సెగ్మెంట్లో రూ.3,739 కోట్లు చొప్పున పెట్టుబడలు పెట్టారు. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.80,310 కోట్లు విలువైన పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.

మరిన్ని వార్తలు