డాగ్‌స్పాట్‌లో టాటా పెట్టుబడులు

5 Jan, 2016 01:03 IST|Sakshi

న్యూఢిల్లీ: వరుసగా వివిధ స్టార్టప్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తున్న పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా పెంపుడు జంతువుల సంరక్షణ ఉత్పత్తుల పోర్టల్ డాగ్‌స్పాట్‌డాట్‌ఇన్‌లో పెట్టుబడులు పెట్టారు. అయితే, ఆయన ఎంత ఇన్వెస్ట్ చేసినదీ వెల్లడి కాలేదు. రతన్ టాటాతో పాటు వ్యాపారవేత్త రోనీ స్క్రూ వాలా, అశోక్ మిట్టల్, రిషి పార్తి, ధీరజ్ జైన్, అభిజిత్ పాయ్ తదితరులు కూడా తాజాగా పెట్టుబడులు పెట్టినట్లు డాగ్‌స్పాట్‌డాట్‌ఇన్ సహవ్యవస్థాపకుడు రాణా అథేయా తెలిపారు.

దేశీయంగా పెంపుడు జంతువుల సంరక్షణ ఉత్పత్తుల రంగం (పెట్ కేర్ మార్కెట్) గణనీయంగా వృద్ధి చెందుతోందనడానికి తమ సంస్థలో దిగ్జల పెట్టుబడులే నిదర్శనమని ఆయన ఈ సందర్భంగా వివరించారు. కొత్తగా వచ్చిన నిధులతో మరిన్ని కొత్త ఉత్పత్తులను అందించేందుకు వినియోగించనున్నట్లు రాణా చెప్పారు.
 
అంతర్జాతీయంగా పెట్ కేర్ మార్కెట్ 100 బిలియన్ డాలర్ల మేర ఉండగా, ఇందులో అమెరికా మార్కెట్ దాదాపు 58 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశీయంగా సుమారు నలభై లక్షల పెంపుడు శునకాలతో భారత పెట్ కేర్ మార్కెట్ 1.22 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని, ఏటా 35 శాతం వృద్ధి నమోదు చేస్తోందని అంచనా. డాగ్‌స్పాట్‌డాట్‌ఇన్  2012 నుంచి ఏటా వివిధ ఇన్వెస్టర్ల నుంచి విడతలవారీగా పెట్టుబడులు సమీకరిస్తోంది.

మరిన్ని వార్తలు