ప్రధానితో ఆర్‌బీఐ గవర్నర్‌ భేటీ

13 Nov, 2018 00:37 IST|Sakshi

విభేదాల పరిష్కార యత్నాలు

న్యూఢిల్లీ: కేంద్రంతో వివాదాస్పద అంశాలను పరిష్కరించుకునే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ గత వారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న న్యూఢిల్లీ వచ్చిన ఉర్జిత్‌ పటేల్‌.. ప్రధాని కార్యాలయంలో పలువురు సీనియర్‌ అధికారులతో సమావేశం అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్నింటిలో ప్రధాని కూడా పాల్గొన్నట్లు వివరించాయి.

ఈ చర్చల నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలివ్వడానికి సంబంధించి ఆర్‌బీఐ ప్రత్యేక విధానమేదైనా రూపొందించే అవకాశమున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపాయి. అయితే, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) లిక్విడిటీ సమస్యలు తీర్చడం, రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గరున్న మిగులు నిధుల్లో గణనీయ భాగాన్ని ప్రభుత్వానికి బదలాయించడం వంటి అంశాలపై ఏదైనా అంగీకారం కుదిరిందా లేదా అన్నది తెలియరాలేదు. ఈ నెల 19న రిజర్వ్‌ బ్యాంక్‌ బోర్డు కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు