ఆ బ్యాంకుపై ఆంక్షలు : కస్టమర్లకు షాక్‌

24 Sep, 2019 13:02 IST|Sakshi

పంజాబ్ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ 6 నెలలు ఆంక్షలు 

వెయ్యి రూపాయలు మాత్రమే  విత్‌డ్రా

సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) టాప్‌ కార్పొరేషన్‌ బ్యాంకుపై ఆంక్షలు విధించింది. పంజాబ్ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్‌(పీఎంసీ) పై ఆరు నెలల  పాటు ఆంక్షలు విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949, సెక్షన్ 35 ఎ కింద ఈ చర్య తీసుకున్నట్టు ఆర్‌బీఐ మంగళవారం జారీ చేసిన ఒక నోటీసులో పేర్కొంది.

ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం డిపాజిటర్లు, ఖాతాదారులు వెయ్యి రూపాయలుమాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉందని బ్యాంకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ యోగేశ్‌ దయాల్‌ వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా వేలాది మంది బ్యాంకు ఖాతాదారులు ఇబ్బందుల్లో పడ్డారు. ప్రధానంగా  ముంబై బ్రాంచ్‌ వద్ద కస్టమర్లు ఆందోళనకు దిగారు.  ఒకవైపు రానున్నపండుగ సీజన్‌.. మరోవైపు  వెయ్యి రూపాయలకు మించి  నగదు ఉపసహంరణ  కూడదనే నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది  సామాన్య జనులపై తీరని భారమని పేర్కొన్నారు.  తాను 3లక్షల ఆర్‌డీ డిపాజిట్‌ చేశానని, ఇపుడు వెయ్యి రూపాయలకు మించి డ్రా  చేయకూడదంటే.. తన కుమార్తె ఫీజు ఎలా కట్టాలని ఒక ఖాతాదారుడు వాపోయాడు. 

ఆర్‌బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం  పొదుపు బ్యాంకు ఖాతా లేదా కరెంట్ అకౌంట్ లేదా మరేదైనా  పీఎంసీ ఖాతాదారుడు తన మొత్తం బ్యాలెన్స్‌లో  వెయ్యి  రూపాయలు మించి విత్‌ డ్రా చేసుకునే అవకాశం. అలాగే బ్యాంకు ఎలాంటి రుణాలను మంజూరు చేయలేదు. దీంతోపాటు  ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఖాతాను ఓపెన్‌ చేసే అవకాశం కూడా లేదు. మరోవైపు ఈ వ్యవహారంపై  బ్యాంకు స్పందించింది. గడుపులోపే పరిస్థితిని చక్కదిద్దుతామని  పీఎంసీ బ్యాంకు ఎండీ జాయ్‌ థామస్‌ వినియోగదారులకు రాసిన ఒక లేఖలో వివరణ ఇచ్చారు.  ఇది డిపాజిటర్లకు, కస‍్టమర్లందరికీ కష‍్టమైన సమయం అంటూ క్షమాపణలు  చెప్పారు. దయచేసి తమతో  సహకరించమని విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా ఈ పరిస్థితిని అధిగమించి బలంగా నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు.  

కాగా 1984లో ముంబైలో​ ప్రారంభమైన ఈ బ్యాంకు పలు రాష్ట్రాల్లో, 137 బ్రాంచ్‌లతో తన సేవలను అందిస్తోంది. కోపరేటివ్‌ బ్యాంకుల్లో టాప్‌ 10లో చోటు సంపాదిస్తున్న పీఎంసీ మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, గోవా, గుజరాత్‌,  ఆంధ్రప్రదేశ్ (ఉ‍మ్మడి)‌, మధ్యప్రదేశ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

>
మరిన్ని వార్తలు