రూ 40,400 కోట్లు రాబట్టాయి : ఆర్బీఐ నివేదిక

30 Dec, 2018 17:57 IST|Sakshi

సాక్షి, ముంబై : దివాలా చట్టానికి కోరలుతేవడం, సర్ఫేసి చట్ట సవరణలతో 2017-18 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకులు ఒత్తడికి లోనయ్యే రుణాల రికవరీలో గణనీయ పురోగతి సాధించాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. మార్చి 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ 40,400 కోట్ల రాని బాకీలను వసూలు చేశాయని ఇవి 2017 ఆర్థిక సంవత్సరంలో రూ 38,500 కోట్లుగా నమోదయ్యాయని ఈ నివేదిక తెలిపింది.

దివాలా చట్టం (ఐబీసీ), సర్ఫేసి చట్టం, డెట్‌ రికవరీ ట్రిబ్యునల్స్‌, లోక్‌ అదాలత్‌ వంటి వివిధ మార్గాల్లో బ్యాంకులు మొండి బకాయిలు, రాని బాకీలను పరిష్కరించుకున్నాయని పేర్కొంది. ఇక ఐబీసీ ద్వారా బ్యాంకులు రూ 4900 కోట్ల మేర రాని బాకీలను వసూలు చేయగా, సర్ఫేసి చట్టం ద్వారా రూ 26,500 కోట్లను రాబట్టాయని 2017-18లో బ్యాంకింగ్‌ ధోరణలు, పురోగతిపై ఆర్బీఐ ఈ వారాంతంలో విడుదల చేసిన వార్షిక నివేదికలో పొందుపరిచింది.

మొండి బకాయిల సత్వర వసూలుకు సర్ఫేసి చట్టాన్ని సవరిస్తూ బాకీ దారు 30 రోజుల్లోగా తన ఆస్తుల వివరాలను వెల్లడించకుంటే మూడు నెలల జైలు శిక్షతో పాటు పలు కఠిన నిబంధనలు విధించడంతో రుణాల వసూలు ప్రక్రియ వేగవంతమైందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. మరోవైపు బకాయిదారు ఆస్తుల వివరాలతో నిర్ధేశిత గడువులోగా ముందుకు రాకుంటే తనఖాలో ఉంచిన ఆస్తులను ఆయా బ్యాంకులు స్వాధీనం చేసుకోవచ్చనే నిబంధన కూడా రుణాల సత్వర వసూళ్లకు ఊతమిస్తోందని పేర్కొంది. ఇక ఐబీసీ ద్వారా ఎక్కువ మొత్తంలో రుణాలు అధికంగా వసూలవుతున్నాయని వెల్లడించింది. మొండి బకాయిలు, రాని బాకీల వసూళ్లలో ఐబీసీ ముఖ్యమైన మార్గంగా ఉపకరిస్తోందని తెలిపింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు